● అమర జవాన్ ట్రస్టు ఫౌండర్
ఏడు కొండలు
● ఘనంగా సాయితేజ విగ్రహ ఆవిష్కరణ
సాయితేజ కుటుంబ సభ్యులను ఊరేగింపుగా తీసుకొస్తున్న విద్యార్థినులు
విగ్రహావిష్కరణలో అమర జవాన్ ట్రస్టు నాయకులు
కురబలకోట : దేశ సేవలో అమరుడైన సాయితేజ మరుపురాని సైనికుడని, అంతేకాదు తెలుగు వారికి గర్వకారణమని ఉభయ తెలుగు రాష్ట్రాల అమర జవాన్ ట్రస్టు ఫౌండర్, చైర్మన్ మామిడి ఏడు కొండలు కొనియాడారు. సైన్యంలో పని చేస్తూ త్రివిధ దళాధిపతి (సీడీఎస్) బిపిన్ రావత్ వద్ద పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా ఉంటూ 2021లో తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో సాయితేజ అమరుడైన విషయం తెలిసిందే. కురబలకోట మండలం రేగడకు చెందిన సాయితేజ విషాదకర సంఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచంలోని తెలుగు వారిని ఎంతగానో కలచి వేసింది. శుక్రవారం అంగళ్లు మార్గంలోని విశ్వం కళాశాల బైపాస్ సర్కిల్‌లో అమర జవాన్ ట్రస్టు ఆధ్వర్యంలో విశ్వం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రఘునాథరెడ్డి నేతృత్వంలో సాయితేజ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తొలుత విశ్వం కళాశాల నుంచి భారీ జాతీయ పతాకంతో విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఏబీపీఎస్‌ఎస్‌పీ అధ్యక్షులు పాలేటి రాంబాబు మాట్లాడుతూ అమర వీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారి స్మృతిని నిలబెట్టుకోవడం బాధ్యతగా భావించాలన్నారు. విశ్వం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రఘునాథరెడ్డి మాట్లాడుతూ సాయితేజ తమ కళాశాలలో డిగ్రీ వరకు చదవడం కళాశాలకు గర్వ కారణమన్నారు. విధి నిర్వహణలో అమరుడై తమ కళాశాల దగ్గర అతని విగ్రహావిష్కరణ జరగడం మరింత గౌరవంగా భావిస్తున్నామన్నారు. విద్యార్థులకు స్ఫూర్తి, ప్రేరణదాయకంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీపీఎస్‌ఎస్‌పీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఎం.వెంకట్రమణారెడ్డి, రవీంద్రబాబు నాయుడు, సాయితేజ తల్లిదండ్రులు మోహన్, మాజీ ఎంపీటీసీ భువనేశ్వరి, సాయితేజ కుమారుడు మోక్షజ్ఞ, కుమార్తె దర్సిని, స్కూల్ ఎడ్యుకేషన్ రీపార్‌మ్స్ కమిటీలో రాష్ట్ర రెగ్యులేటరీ, మానిటరింగ్ కమిషన్ మాజీ సభ్యులు బి.ఈశ్వరయ్య, సుదర్సన్, మాజీ సైనిక అసోసియేషన్ నాయకులు కంచెర్ల శ్రీనివాసుల నాయుడు, ఎం.వెంకట్రమణారెడ్డి, ప్రతాప్‌రెడ్డి, వెంకటస్వామితోపాటు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
అండగా నిలిచిన వైఎస్ జగన్ ప్రభుత్వం
సాయితేజ అమరుడైన సమయంలో జగన్ ప్రభుత్వం వీరి కుటుంబానికి అండగా నిలిచింది. అప్పటి రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ద్వారా రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియాను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందజేసింది. సాయితేజ భార్య శ్యామలకు ప్రభుత్వ భూమిని కేటాయించారు. అంతేగాకుండా ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా కల్పించి జగన్ ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది. సాయితేజ కుటుంబాన్ని సగౌరవంగా చూసుకున్నారు.


