పులకించిన భక్తఝరి
● పంచాక్షరితో ప్రతిధ్వనించిన క్షేత్రం
● అరుణోదయ స్నానాలతో
భక్తుల కోలాహలం
ఝరిలో పోటెత్తిన భక్తులు
సంబేపల్లె : మహాశివరాత్రిని పురస్కరించుకొని మండల సరిహద్దులో ప్రసిద్ధిగాంచిన శైవ క్షేత్రం ‘ఝరి’లో భక్తులు పోటెత్తారు. పరమఽశివుడిని పవిత్రంగా కొలిచి ఉపవాస దీక్షలతో జాగారం చేసి పవిత్ర బాహుదానదిలో స్నానం ఆచరిస్తే సర్వపాపాలు తొలగి, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పూర్వం నుంచి ఈ ప్రాంత భక్తులలో అపార నమ్మకం. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలివచ్చి అరుణోదయ స్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా భక్తులు హరహర మహాదేవా... శంభోశంకరా... అంటూ ఆదిదేవుడి ఎదుట ప్రణమిల్లారు. వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఝరి ప్రాంతం జనసంద్రంగా మారింది. అనంతరం వేదపండితులచే సమీపంలోని సిద్ధేశ్వరుని ఆలయంలోని లింగశ్వరూపునికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేశారు.
కడప, చిత్తూరు ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన దేవరెద్దుల నాణేలు ఝరిలో స్నానాలు ఆచరించి పులకాపన చేయడం జరిగింది. సుదూర ప్రాంతాలైన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, నెల్లూరు, నంద్యాల, తదితర జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏపీఎస్‌ఆర్‌టీసి అధికారులు బస్సులను ఏర్పాటు చేశారు. అనంతరం చెక్కభజనలు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.
పులకించిన భక్తఝరి
పులకించిన భక్తఝరి


