కలెక్టరేట్‌కు అర్జీదారుల క్యూ !
● సమస్యలకు పరిష్కారం చూపాలని విన్నపాలు
● వివిధ సమస్యలపై నమోదైన 191 అర్జీలు
పీజీఆర్‌ఎస్‌లో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ
టీడీపీ నాయకుల కబ్జా నుంచి భూమిని విడిపించి న్యాయం చేయాలంటున్న చిరంజీవి, రెడ్డిప్రసాద్
మదనపల్లె రూరల్ : ‘సారూ... మాకు న్యాయం చేయండి..’ అంటూ అర్జీదారులు మొరపెట్టుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో అర్జీలు సమర్పించేందుకు క్యూ కట్టారు. ఎన్నిసార్లు తిరుగుతున్నా క్షేత్రస్థాయిలో న్యాయం జరగడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జేసీ శివ నారాయణశర్మ, సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి, డీఆర్వో మధుసూధనరావు, సర్వే ఏడీ భరత్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ మాట్లాడుతూ ప్రజలు అందజేసే అర్జీలకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో జిల్లాలోని 5 నియోజకవర్గాల నుంచి వివిధ సమస్యలపై 191 అర్జీలు పరిష్కారం కోసం ప్రజలు అందజేశారు.
నిమ్మనపల్లె మండలం రాచవేటివారిపల్లె పంచాయతీ మాచిరెడ్డిగారిపల్లెలో 50 ఏళ్లుగా తమ అనుభవంలో ఉంటూ సాగు చేసుకుంటున్న భూమికి, అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు ఫోర్జరీ పత్రాలతో తప్పుడు పాసుపుస్తకాలు, 1బీ చేసుకుని, అధికార బలంతో తమను భూమిలోకి రానీయకుండా అడ్డుకుంటున్నారని కే.చిరంజీవి, రెడ్డిప్రసాద్‌లు అర్జీ అందజేశారు. భూమి తమ అనుభవంలో ఉన్నట్లు ఆధారాలను జాయింట్ కలెక్టర్‌కు అందించి, తమకు న్యాయం చేయాల్సిందిగా వేడుకున్నారు.
మదనపల్లె రూరల్ మండలం చిప్పిలి గ్రామంలో అంగన్‌వాడీ వర్కర్‌గా పనిచేస్తున్న రాజేశ్వరి, చీటీలు, వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని కోట్ల రూపాయల మోసాలకు పాల్పడుతోందని జంగాల దేవరాజ్ ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ, అధిక వడ్డీల ఆశ చూపి మోసం చేస్తోందన్నారు. రాజేశ్వరి మోసంపై డీఎస్పీకి ఫిర్యాదుచేసినా స్పందన లేకపోవడంతో కలెక్టరేట్‌కు వచ్చినట్లు తెలిపారు.
అంధత్వంతో బాధపడుతూ, చూపులేక జీవనోపాధి కోసం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొత్తగా దివ్యాంగుల పెన్షన్ మంజూరుచేయాలని సదుం మండలానికి చెందిన వి.శ్రీనివాసులు అర్జీ సమర్పించారు.
పదిహేనేళ్లుగా వంటమనిషిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకున్న తాను, పక్షవాతంతో శారీరకంగా బలహీనపడి, పనులు చేయలేని స్థితికి చేరుకున్నానని, కుటుంబపోషణ కోసం దివ్యాంగ పెన్షన్ మంజూరు చేసి తనను ఆదుకోవాల్సిందిగా మదనపల్లె పట్టణం నక్కలదిన్నె తండాకు చెందిన బి.శ్రీనివాస్ నాయక్ అర్జీ అందజేశారు.
రెండు కాళ్లు బలహీనంగా ఉండి, దివ్యాంగ పెన్షన్ పొందుతున్న తమ కుమారుడు షేక్ మహమ్మద్ జైన్ బడికి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నాడని, మూడు చక్రాల స్టార్టింగ్ బండి మంజూరు చేయాలని మదనపల్లె గౌసియావీధికి చెందిన తల్లిదండ్రులు జావీద్, కౌసర్‌లు విన్నవించారు.
కలెక్టరేట్‌కు అర్జీదారుల క్యూ !


