నిబంధనల ఉల్లంఘనపై చర్యలేవీ?
● విచారణ తొక్కి పెట్టారా
● కలెక్టర్ ఆదేశించినా స్పందించని
రిజిస్ట్రేషన్ శాఖ
మదనపల్లె : మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నిబంధనలను ఉల్లంఘించి జరిగిన రిజిస్ట్రేషన్లపై ఒక్క పరిశీలన కూడా జరగడం లేదని తెలుస్తోంది. ఇందులో ఒక రిజిస్ట్రేషన్‌కు సంబంధించి గత జిల్లా కలెక్టర్ శ్రీధర్‌కు ఫిర్యాదులు వెళ్ళగా వాటిపై చర్యలకు రిజిస్ట్రేషన్ జిల్లా అధికారికి పంపారు. ఇప్పటిదాకా విచారణ కాదు కదా కనీసం పరిశీలన కూడా జరగలేదని స్పష్టంగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. మదనపల్లె చెందిన వ్యక్తి స్థానిక సీటీఎం రోడ్డులోని ఓ హాస్పిటల్ కు సంబంధించి ఒకే విలువ ఉండగా, నిబంధనలో ఉల్లంఘించి విలువ తగ్గించి రెండు రిజిస్ట్రేషన్లు చేయడంతో ప్రభుత్వానికి లక్షల ఆదాయం నష్టం కలిగిందని గత ఏడాది ఫిబ్రవరి 28న అప్పటి కలెక్టర్ శ్రీధర్ కు ఫిర్యాదు పంపారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి పెరిగిందని దానికి సంబంధించిన కొన్ని వివరాలతో లేఖ రాశారు. ఈ లేఖను కలెక్టర్ రిజిస్ట్రేషన్ల శాఖ జిల్లా అధికారికి పంపారు. దీన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచన చేశారు. అయితే ఏడాది గడిచినా ఈ ఫిర్యాదుపై సంబంధిత అధికారులు ఒక్క పరిశీలన కూడా చేపట్టలేదు. ఈ నేపథ్యంలో నిబంధనలను ఉల్లంఘించి స్థానిక సీటీఎం రోడ్డులోని ఓ హాస్పిటల్ రిజిస్ట్రేషన్ కి సంబంధించి ఒకే ఆస్తిని రెండుగా విడగొట్టడమే కాక, మార్కెట్ విలువను భారీగా తగ్గించి రిజిస్ట్రేషన్ చేసిన విషయాన్ని గత ఏడాది జులైలో సాక్షి వెలుగులోకి తెచ్చింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి రూ.28.60 లక్షల ఆదాయం నష్టం కలిగింది. ఇది ఒక్క ఆస్తికి సంబంధించి మాత్రమే..ఇంకా ఇలాంటి నిబంధనల ఉల్లంఘనలు ఎన్నో జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై అప్పటి జిల్లా అధికారులు కనీసం స్పందించకపోవడంతో విచారణ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఏడాది కాలంలో జిల్లా అధికారులు పలుమార్లు స్థానిక రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని తనిఖీ చేసినా ఈ అంశాన్ని ఎక్కడా ప్రస్తావనకు తీసుకురాలేదు. ఫలితంగా దీనిపై చేసిన ఫిర్యాదు బుట్ట దాఖలైంది. కనీసం పరిశీలన చేసి ఉంటే అక్రమాలు ఏ మేరకు జరిగాయో బహిర్గతం అయ్యేది. బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉండేది. ఇవేమీ చేయకపోగా కనీసం స్పందించలేదన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది.
ఇప్పుడు ఐజి పరిశీలనలో
ఓ హాస్పిటల్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్ వ్యవహారం ఆ శాఖ ఐజీ స్థాయి అధికారి పరిశీలనకు వెళ్ళినట్లు ప్రచారం జరుగుతోంది. ఒక రిజిస్ట్రేషన్ కు సంబంధించే రూ.28.60 లక్షల నష్టం వాటిలిందంటే అక్కడ పనితీరు ఏ విధంగా ఉందో అని ఉన్నత స్థాయి వర్గాలు ఆరా తీస్తున్నట్లు సమాచారం.
విచారణ జరపలేదు
ఓ హాస్పిటల్ రిజిస్ట్రేషన్ కు సంబంధించి కలెక్టర్ కు అందిన ఫిర్యాదుపై తాను ఎలాంటి విచారణ చేయనిది వాస్తవమేనని మొన్నటిదాకా జిల్లా ఇన్చార్జ్ డిఆర్ గా పనిచేసిన చిత్తూరు డీఆర్ మూర్తి సోమవారం స్పష్టం చేశారు. దీనిపై తమ శాఖ ఉన్నతాధికారుల నుంచి కూడా విచారణకు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని స్పష్టం చేశారు.


