పందెం కోడి... పండక్కి రెడీ | - | Sakshi
Sakshi News home page

పందెం కోడి... పండక్కి రెడీ

Dec 18 2025 7:44 AM | Updated on Dec 18 2025 7:44 AM

పందెం

పందెం కోడి... పండక్కి రెడీ

● కుక్కుట శాస్త్రం ఆధారంగా కూడా పందేలు

సమరానికి సై అంటున్న కోళ్లు

తర్ఫీదు ఇస్తున్న పందెం రాయుళ్లు

పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా...

జిల్లాలో ప్రతి ఏటా సాగుతున్నకోడి పందేలు

రాజంపేట టౌన్‌: రాష్ట్రంలో అతి పెద్ద పండుగ సంక్రాంతి. ఈ పండుగను ప్రతి ఒక్కరూ జోష్‌గా జరుపుకుంటారు. అయితే కొంతమంది సంక్రాంతిని పురస్కరించుకొని కోడి పందేలు కాస్తారు. కోడిపందెం కాయకుంటే వారికి సంక్రాంతి ఆనందం లేదన్నట్లు కూడా భావించేవారు లేకపోలేదు. చట్టరీత్యా కోడిపందేలు కాయడం నేరం అయినప్పటికీ పందెంరాయుళ్లు మాత్రం ప్రతి ఏడాది పోలీసుల కన్నుగప్పి జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో మూడు రోజులు కోడి పందేలు కాయడం ప్రతి ఏటా సాగుతూనే ఉంది. సంక్రాంతి పండుగకు నెల రోజులు కూడా సమయం లేక పోవడంతో పందెం నిర్వాహకులు కోళ్లను పందేనికి సిద్ధం చేస్తున్నారు. బరిలో దింపే కోళ్లపై గత మూడు నెలల నుంచి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వస్తున్నారు.

పందేలు....రకాలు

జిల్లాలో పందేలు రెండు రకాలుగా జరుగుతాయి. కొంత మంది ముందుగానే కోళ్లను చూసుకొని పందెం డబ్బులు మాట్లాడుకొని పందెం నిర్వహిస్తారు. మరికొంత మంది పందెం జరిగే ప్రాంతానికి వెళ్ల బరిలో దిగే కోళ్లను చూసి వారికి నచ్చిన కోడిని ఎంచుకొని పందెం కాస్తారు. సరదాగా కోడిపందేలు చూసేందుకు వచ్చిన వారు సైతం పందెం కాస్తుంటారు.

గోదావరి జిల్లాలకు భిన్నంగా.....

సంక్రాంతి సందర్భంగా నిర్వహించే కోడిపందేలకు గోదావరి జిల్లాలు ప్రసిద్ది. అక్కడ కోడి ఒకసారి బరిలోకి దిగితే ఏదో ఒక కోడి ఓడిపోయి చనిపోవడం కాని లేకుంటే లేవలేని స్థితిలో పడియే వరకు వాటి వద్దకు వెళ్లరు. అయితే అన్నమయ్య జిల్లాలో అందుకు భిన్నంగా పోరు సాగుతుంది. పోరుసాగే సమయంలో పందెంరాయుళ్ల మధ్యలో వెళ్లి తమ కోళ్లను బరి నుంచి బయటకు తీసుకు వస్తారు. తరువాత కొద్దిసేపటికి బరిలోకి దింపుతారు.

పందెం కోడి చాలా కాస్ట్‌లీ

సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో పందెం కోళ్ళ విక్రయాలు చాపకింద నీరులా జోరుగా సాగిపోతున్నాయి. పందెం కోళ్ల ధరలు పది వేల నుంచి దాదాపు 30 వేలకు పైగా ఉన్నట్లు సమాచారం. వీటిలో అనేక జాతులు ఉన్నాయి. కోడి జాతిని బట్టి కూడా ధర పలుకుతుంది. పందెం కోళ్లకు సంబంధించి కోడి నెమలి, కాకి నెమలి, పచ్చకాకి, డేగ ఇలా దాదాపు 30కి పైగా రకాలు ఉన్నాయి.

కుక్కుట శాస్త్రం పుస్తకం

కుక్కుట శాస్త్రం గురించి పందెం రాయుళ్లకు తప్ప సాధారణ ప్రజలకు పెద్దగా తెలియదు. కుక్కుట శాస్త్రం బట్టి కోడి పందేలను నిర్వహిస్తారు అంటే సాధారణ ప్రజలకు అతిశయోక్తి అనిపించినా ఇది నిజం. కోడి పందేల నిర్వహణ కోసం కుక్కుట శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు కూడా ఉన్నాయి. అనేక మంది పందెం రాయుళ్లు కుక్కుట శాస్త్రం ద్వారా కోడిపుంజు జాతి, రంగు చూసి బరిలోకి దింపేందుకు ముహూర్తం నిర్ణయిస్తారు. అలాగే పందేనికి ఏ దిక్కున ఏ సమయంలో వెళితే కలిసి వస్తుందన్న విషయాన్ని కూడా కుక్కుట శాస్త్రం పుస్తకంలో చూసి పందేనికి బయలుదేరుతుంటారు. ఇక తిథులను బట్టి ఆ రోజు కలిసివచ్చే రంగులను పందెంరాయుళ్లు అంచనా వేస్తారు. కొంత మంది కుక్కుట శాస్త్రం ఆధారంగా కోడి రంగును బట్టి పందెం కాస్తారు.

పందెం కోడి... పండక్కి రెడీ 1
1/1

పందెం కోడి... పండక్కి రెడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement