మదనపల్లెలో స్క్రబ్ టైఫస్ కలకలం
మదనపల్లె రూరల్: అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గంలో స్క్రబ్ టైఫస్ కలకలం రేగింది. ప్రస్తుతం మదనపల్లె మండలంలో 8 మందికి, నిమ్మనపల్లె మండలంలో 1 మొత్తం 9 మందికి స్క్రబ్ టైఫస్ పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆయా ప్రాంతాల్లో కీటకాల నివారణ, పారిశుధ్య నిర్వహణకు చర్యలు చేపట్టారు. బుధవారం మండలంలోని కోళ్లబైలు పంచాయతీ చెరువుముందరపల్లె, సీటీఎం, కొత్తవారిపల్లె, బసినికొండ,శివాజీనగర్, ముజీబ్‌నగర్, బాబూకాలనీ, రామారావు కాలనీ, నిమ్మనపల్లె మండలం చల్లావారిపల్లెలో కేసులు ఉన్నట్లు వైద్యశాఖ అధికారులు తెలిపారు. వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత సరైన వైద్యం తీసుకుంటే, స్క్రబ్‌టైఫస్ ప్రాణాంతం కాదని, పొలాలు, పొదలు, గడ్డివాములు వంటి ప్రదేశాల్లో స్క్రబ్స్ ఎక్కువగా ఉండటం, ఆ పురుగు కుట్టిన తర్వాత తల తిరగడం, గందరగోళంగా ఉంటుందన్నారు. పొలాల్లో, తోటల్లో పనులు చేసేవారు, చెప్పుల్లేకుండా గడ్డిలో వాకింగ్ చేసేవారు జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. జ్వరం, ఒళ్లు నొప్పులు, శరీరంపై దద్దుర్లు, కుట్టిన చోట గట్టి మచ్చ ఏర్పడటం తదితర లక్షణాలు కనిపిస్తాయన్నారు. అనుమానం ఉన్న వ్యక్తులు నేరుగా ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి వస్తే రక్తపరీక్షలు నిర్వహించి ఎలీసా టెస్ట్‌కు నమూనాలు పంపి వ్యాధిని నిర్ధారిస్తామన్నారు.
నియోజకవర్గంలో 9 మందికి
వ్యాధి నిర్ధారణ


