ఆ రెండు మండలాలు కడప జిల్లాలోనే ఉండాలి
ఒంటిమిట్ట : సిద్దవటం, ఒంటిమిట్ట మండలాలు కడప జిల్లాలోనే ఉండాలని వైఎస్సార్‌సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఒంటిమిట్ట, సిద్దవటం మండలాలను అన్నమయ్య జిల్లాలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మండల కేంద్రంలో జేఏసీ నిర్వహిస్తున్న 9వ రోజు రిలే నిరాహార దీక్షకు వైఎస్సార్‌సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షడు , రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి, మండల వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు సంఘీభావం తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ఆకేపాటి మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా అన్నమయ్య జిల్లాలో ఒంటిమిట్ట, సిద్దవటం మండలాలను విలీనం చేయడానికి ప్రయత్నిస్తే ప్రజల అవసరాలు, ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వారికి మేలు జరిగే విధంగా ఈ రెండు మండలాలను కడప జిల్లాలోనే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కొనసాగించిందని గుర్తు చేశారు. నేటి కూటమి ప్రభుత్వం వారి స్వార్థ రాజకీయాల కోసం ఈ రెండు మండలాలను అన్నమయ్య జిల్లాలో విలీనం చేసిందన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరి, వైఎస్సార్‌సీపీ ఒంటిమిట్ట మండల అధ్యక్షుడు టక్కోలు శివారెడ్డి, రాష్ట్ర మాజీ డైరెక్టర్ ఆకేపాటి వేణుగోపాల్ రెడ్డి, జేఏసీ మండల అధ్యక్షుడు భవనాసి రామదాసు, ఉపాధ్యక్షుడు పాటూరి గంగిరెడ్డి, జేఏసీ నాయకులు బాలరాజు శివరాజు, కో–ఆప్షన్ మెంబర్ షేక్ మహమ్మద్ రఫీ పాల్గొన్నారు.
రాయచోటి వద్దు.. కడప ముద్దు
సిద్దవటం : సిద్దవటం మండలాన్ని కడప జిల్లాలోనే కొనసాగించాలని ప్రభుత్వ ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. సిద్దవటం తహసీల్దార్ కార్యాలయం వద్ద జేఏసీ నేతల ఆధ్వర్యంలో జరుగుతున్న ఐదో రోజు రిలే నిరాహార దీక్షలో ఆదివారం ప్రభుత్వ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వారు రాయచోటి వద్దు.. కడప ముద్దు అంటూ నినాదాలు చేశారు. రిలే నిరాహార దీక్షలో ఉపాధ్యాయులు డీవీఎస్ ప్రసాద్‌రెడ్డి, సుభాష్‌బాబు, ఖాదర్‌వలి, నరసింహబాబు, రమణ, ఓబయ్య, కుమార్‌రెడ్డి, లక్షుమయ్య కూర్చున్నారు. జేఏసీ నాయకులు రాజగోపాలయ్య, పాలెం నారాయణ, అయ్యవారు నాయుడు, సిద్దయ్య, పోలు సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి
ఆ రెండు మండలాలు కడప జిల్లాలోనే ఉండాలి


