ఖర్చు ఎక్కువ..రాబడి తక్కువ
● బూడిదరోగంతో దెబ్బతిన్న పంటలు
● ఎకరాకు రెండు, మూడు బస్తాలే దిగుబడి
● వేరుశనగ రైతు విలవిల
గుర్రంకొండ: వ్యవసాయం జూదంలో రైతన్న ఓడిపోతూనే ఉన్నాడు.ఆరుగాలం శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. కోటి ఆశలతో సాగు చేసిన వేరుశనగ పంట రైతులను నట్టేట ముంచింది. జిల్లాలో ఈ ఏడాది 8936 హెక్టార్లలో వేరుశనగ సాగు చేశారు. జిల్లావ్యాప్తంగా రూ.40.21కోట్ల మేరకు నష్టం వాటిల్లింది. దీంతో రైతులు ప్రభుత్వం అందించే ఇన్‌పుట్ సబ్సీడీ కోసం ఎదురుచూస్తున్నారు.ఇటీవల జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలకు వేరుశనగ పంట నల్లగా మారి దెబ్బతింది. ప్రస్తుతం ఏ పొలంలో చూసినా ఎండిపోయిన చెట్లు దర్శనమిస్తున్నాయి. కాయలు ఉన్నప్పటికీ అవి భూమిలోపలే పూర్తిగా దెబ్బతిన్నాయి.కాయల్లో ఉన్న అరకొర గింజల్లో తేమశాతం కూడా లేక లొత్తలుగా మారాయి. భూమిలోపల వేళ్ల నుంచి చెట్ల పైన కాండం వరకు నల్లగా మారింది. బూడిద రోగం సోకడంతో కాయలు, బుడ్డలు ఏస్టేజిలో ఉన్నాయో అలాగే ఎదుగుబొదుగు లేక దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది.
ఎకరాకు రెండు నుంచి మూడు
బస్తాలే దిగుబడి:
జిల్లాలో ఈఏడాది సాగు చేసిన వేరుశనగ పంట ఎకరానికి రెండు నుంచి మూడు బస్తాలే దిగుబడి ఇచ్చింది. ప్రస్తుతం కొంతమేరకు చెట్లకు కాయలు ఉన్నా అవి కాస్తా బూడిద రోగంతో చేతికి అందకుండా పోయాయి. ఒక్కో చెట్టుకు ఎనిమిదివరకు కాయలు, నాలుగు నుంచి ఆరు వరకు బుడ్డకాయలు ఉన్నాయి.పదిహేనురోజుల కింద పంట చేతికొచ్చి కోతదశలో ఉండేది. అప్పట్లో వర్షాలు భారీగా కురవడంతో భూమిలోపల చెట్టుకు ఏర్పడిన బుడ్డకాయలు, కొద్దిశాతం గింజలున్న కాయలు బూడిద రోగంతో దెబ్బతిని చెట్టువేళ్లు కాండం నల్లగా మారిపోయింది. దీంతో జిల్లాలోని పలు మండలాల్లో సగటున రెండు నుంచి మూడు బస్తాలే పంట దిగుబడి రావడంతో రైతులు భారీగా నష్టపోయారు.
జిల్లాలో రూ.40.21 కోట్ల నష్టం: జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది వేరుశనగ సాగు చేసిన రైతులు రూ . 40.21 కోట్ల మేరకు నష్టపోయారు. ఈ ఏడాది ఖరీఫ్‌సీజన్లో 8936 హెక్టార్లలో వేరుశనగ సాగు చేశారు. పంట సాగు కోసం జిల్లా వ్యాప్తంగా రైతులు రూ. 55.85కోట్ల మేరకు ఖర్చు చేశారు. ప్రస్తుతం భారీగా కురిసిన వర్షాలతో పంట దెబ్బతింది. దీంతో దిగుబడి, పంటసాగు ఖర్చు తెక్కిస్తే రైతు ఎకరానికి రూ. 16 వేలకు పైగా నష్టపోయాడు.
ఇన్‌పుట్ సబ్సీడీపైనే ఆశలు
జిల్లాలో వేరుశనగ రైతులు ప్రభుత్వం అందజేసే ఇన్‌ఫుట్ సబ్సీడీపైనే ఆశలు పెట్టుకొన్నారు. ఇప్పటికే ఇ–క్రాప్ నమోదు చేయించుకొన్నారు. ప్రభుత్వం అందించే పంటలబీమా, ఇన్‌పుట్ సబ్సీడీలపైనే రైతుల భవిష్యత్తు ఆధారం పడి ఉంది. పంటనష్టపరిహారం కూడా సకాలంలో అందేలా ప్రభుత్వంచర్యలు చేపట్టాలని అన్నదాతలు కోరుతున్నారు.
జిల్లాలో వేరుశేశనగ రైతులు ఎకరం పంట సాగుకు రూ. 22 వేల నుంచి రూ. 25 వేల వరకు ఖర్చు చేశారు. పొలం దుక్కుల నుంచి విత్తనకాయలు కొనుగోలు, విత్తనాలు విత్తడం, పంటలో కలుపు మొక్కల నివారణ, పంటకోత, కాయల నూర్పిడి వంటివి ఖర్చు లెక్కిస్తే రైతుకు రూ. 25 వేలు ఖర్చు వస్తుంది. కౌలు రైతులు కౌలు చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ ఖర్చు వస్తుంది. ఈ ఏడాది వర్షాల కారణంగా ఎకరానికి రెండు నుంచి మూడు బస్తాలే దిగుబడి రావడంతో రైతులు భారీగా నష్టపోయారు. ప్రస్తుతం మార్కెట్లో వేరుశనగ బస్తా ధర రూ.2000 నుంచి రూ.2300 ధర పలుకుతోంది. ఈలెక్కన ఎకరానికి సాగు ఖర్చుపోను రైతుకు నష్టం వాటిల్లింది. పలు మండలాల్లో పంట నూర్పిడి పనులకు కూలీలు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. కుప్పల్లో కాయలు వలచాలంటే డబ్బా రూ. 100 వరకు కూలీలకు కూలీ చెల్లించాల్సి ఉండడంతో రైతుకు భారంగా మారింది.
దిగుబడి.. తడబడి
దిగుబడి.. తడబడి


