●బహుదా ప్రాజెక్ట్‌లో పెరిగిన నీటిమట్టం
సాక్షి రాయచోటి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతోపాటు తుపాను ప్రభావంతో జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఉదయం కొద్దిసేపు ఎండ కాసినా ఉపశమనం లభించిందనుకున్న లోపే వర్షం కురుస్తోంది. మూడు, నాలుగు రోజులుగా వర్షాలు పడుతుండడంతో సాగులో ఉన్న పంటలపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. పంట పొలాల్లో నీరు ఉండడంతో పొలంలోకి వెళ్లడానికి కూడా అవకాశం లేదు. దీంతో రెండు, మూడు రోజుల తర్వాత పరిస్థితిని బట్టి అంచనా వేసేందుకు ఉద్యానశాఖతోపాటు వ్యవసాయశాఖ అధికారులు సిద్ధమవుతున్నారు.తుపాను ప్రభావం మరో రోజు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు.
● జిల్లాలో రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పండ్ల తోటలతోపాటు సాధారణ పంటలు దెబ్బతిన్నాయి. మరోవైపు టమాటా పంటకు సంబంధించి తెగుళ్లు ముసురుతుండడంతో రైతులు కాసిన కాయలను పారబోస్తున్నారు. ఎక్కువ రోజులు పొలం తడిగా ఉంటే బొప్పాయితోపాటు అరటి, ఇతర పంటలు కూడా దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. కూరగాయల చెట్లు కూడా కుళ్లిపోతాయని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఉన్నఫలంగా వర్షాలు కురుస్తుండడంతో ఏమి చేయాలో పాలుపోక రైతులు అల్లాడిపోతున్నారు. ప్రధానంగా రైల్వేకోడూరు, రాజంపేట నియోజకవర్గాల్లోని పండ్ల తోటలతోపాటు వరి తదితర పంటలు నేలవాలాయి. అయితే వర్షం తెరిపి ఇచ్చిన తర్వాత భూమి ఆరిన అనంతరం అధికారులు అంచనా వేసే అవకాశం ఉంది.
దెబ్బతింటున్న రోడ్లు: వర్షంతో జిల్లాలోని ప్రధాన రోడ్లు కూడా దెబ్బతింటున్నాయి. ప్రధానంగా కడప–రేణిగుంట జాతీయ రహదారిలో కూడా మళ్లీ గుంతలు మొదటికొచ్చాయి. గతంలో మరమ్మత్తులు చేపట్టినా ఎడతెరిపి లేని వర్షం కురుస్తుండడంతో ఎక్కడ చూసినా రోడ్డులో గుంతలు కనిపిస్తున్నాయి. మరోవైపు రైల్వేకోడూరు నియోజకవర్గంలోని గంగరాజుపోడు, రైల్వేకోడూరు నుంచి మాధవరంపోడు వరకు జాతీయ రహదారిలో కూడా ఎక్కడ చూసినా గుంతలు ఏర్పడ్డాయి. అలాగే పెనగలూరు, మదనపల్లె, రాజంపేట నియోజకవర్గంలోని పలుచోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. ఎప్పుడు వర్షం వచ్చినా ఎక్కువగా రోడ్లే దెబ్బతింటున్నాయి.
● జిల్లాపై వర్ష ప్రభావం జిల్లాలో మూడు, నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. గురువారం కూడా పీలేరులో మంచి వర్షం కురిసింది. రాయచోటి, మదనపల్లెలో కూడా వర్షం పడుతూనే ఉంది. రైల్వేకోడూరు, రాజంపేటలలో కూడా తుంపర వర్షం కనిపిస్తోంది. శుక్రవారం కూడా వర్షం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపధ్యంలో జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది.
ఇళ్లలోకి చేరిన నీరు
సిద్దవటం: కొండ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు మండలంలోని తురకపల్లె గ్రామంలో పలు గృహాల్లోకి వర్షపునీరు చేరింది. విషపురుగులు సంచరిస్తాయేమోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
వర్షానికి నేలకొరిగిన వరి
నందలూరు: గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నందలూరు మండలంలో దాదాపు 62 ఎకరాలలో వరి పంట నేలకొరిగింది. పొత్తపి, నూకినేనిపల్లె, టంగుటూరు, కుమరునిపల్లె, ఆడపూరు, పాటూరు ప్రాంతాలలో వరి పంటకు నష్టం వాటిల్లింది.
ఒంటిమిట్ట: మండల పరిధిలోని గొల్లపల్లి, పెన్నపేరూరు గ్రామాల్లో కలిపి 7 ఎకరాల్లో వరి పంట నేలకొరిగిందని మండల వ్యవసాయ శాఖ అధికారి ఎన్. మంజుల తెలిపారు, చింతరాజుపల్లిలో కేవలం 50 సెంట్లలో వరి పంట నేలకొరిగినట్లు వివరించారు. దీనికి సంబంధించి బాధిత రైతుల వివరాలను సేకరించామన్నారు.
●బహుదా ప్రాజెక్ట్‌లో పెరిగిన నీటిమట్టం


