అడిగేదెవరు.. ఆపేదెవరు
మదనపల్లె: బి.కొత్తకోట మండలంలోని బి.కొత్తకోట–మదనపల్లె రహదారిపై ఉన్న గుమ్మసముద్రం చెరువు పనులను అధికార టీడీపీ నేతల అండతో అడిగేవారు లేరని ఇష్టారాజ్యంగా చేపట్టారు. . కట్ట, మొరవల సాంకేతిక స్థితి ఎలా ఉందో అలాగే అభివృద్ధి పనులు పూర్తి చేయాల్సి ఉంది. సాంకేతిక మార్పులతో పనులు చేయడం ఎట్టి పరిస్థితుల్లో వీలుకాదు. అయితే తాము చేసిందే పని అన్నట్టుగా కొందరికి ప్రయోజనం కలిగించాలని ఎలా పడితే అలా చేశారు. దీంతో రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడమేకాక మొరవ ఎత్తు పనిని పగలగొట్టారు.
● మండలంలోని ఒకట్రెండు పెద్ద చెరువుల్లో గుమ్మసముద్రం చెరువు ఒకటి. దీని కుడివైపు మొరవ, దానికి ముందు భాగంలో కాంక్రీట్ పనులను రూ.28.50 లక్షలతో చేపట్టారు. ఈ మొరవ అక్కడక్కడ దెబ్బతినడం, నీటి ప్రవాహానికి ఇబ్బందికరంగా ఉండటంతో పనులు చేపట్టారు. జలవనరులశాఖ చేపట్టిన పనుల్లో కుడి మొరవ ఎత్తు ఎంతుందో అంతే ఎత్తులో కాకుండా ఒక అడుగు ఎత్తు తగ్గించారని తెలుస్తోంది. ఎత్తు తగ్గించడం ద్వారా నీటి నిల్వ సామర్థ్యం తగ్గతుంది. ఇలా చేయడం ద్వారా చెరువు అంచులోని కొందరి పొలాలు నీటిలో మునగకుండా చేశారని అంటున్నారు. ఇదేకాకుండా ఈ మొరవ ఎత్తు ఎందుకు తగ్గించారో అధికారులకే తెలియాలి. అలాగే చెరువు నిర్మాణం ఇప్పటిదాకా మార్పులేని ఎడమవైపు మొరవ ఎత్తును 20 సెంటిమీటర్ల దాకా పెంచారు. ఇక్కడ ఇలా ఎందుకు పెంచారో కూడా అధికారులకే తెలియాలి. సాంకేతికంగా నిర్మాణమై ఉన్న మొరవలను అలాగే ఉంచాలి. వాటిని తగ్గించడం, పెంచడం అనేది చెరువు నీటిని సమతుల్యం చేయలేని పరిస్థితి వస్తుంది. దీనివల్ల ప్రమాదరక పరిస్థితులు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు.
ఇసుక బస్తాలు ఎందుకు పెట్టారు
కుడి మొరవ ఎత్తు తగ్గిందన్న విషయాన్ని ఆ మొరవపై పెట్టిన ఇసుక బస్తాలు మరింత అనుమానం రేకెత్తిస్తున్నాయి. చెరువు నిండి ప్రవహిస్తుండటంతో మొరవపై ఒకవరసలో ఇసుక బస్తాలను పెట్టారు. దీనివల్ల మొరవ ప్రవాహం ఆగిపోయింది. ఎత్తు తగ్గించడం వల్లే అదే ఎత్తులో ఇసుక బస్తాలు వేశారని అంటున్నారు. అలాగే ఎడమవైపు మొరవ ఎత్తు పెంచడంతో దాన్ని రైతులు రెండుచోట్ల పగులగొట్టి గతంలో మొరవ ప్రవాహం ఎలా జరిగేదో ఇప్పుడు అలాగే జరుగుతోంది. ఇక్కడ మొరవ ఎత్తును ఎందుకు పెంచాల్సి వచ్చిందో అధికారులకే తెలియాలి.
తగ్గించలేదట
కుడిమొరవ ఎత్తు తగ్గించలేదని ఈఈ సురేష్‌బాబు, ఏఈ సతీష్‌లు చెప్పారు. ఎడమ మొరవకు ఎత్తు పెంచాలని రైతులు కోరినట్టు వారు చెప్పగా, ఇప్పుడు ఆ ఎత్తును రైతులు ఎందుకు తొలగించారో చెప్పలేదు. కుడిమొరవపై ఇసుక బస్తాలను వేసింది హంద్రీ–నీవా ప్రాజెక్టు అధికారులని చెప్పుకొచ్చారు. ఈ పనిని ఏ విధంగా కాంట్రాక్టర్‌కు అప్పగించారో తనకు తెలియదని ఏఈ సతీష్ చెప్పడం కొసమెరుపు.
ఎత్తు తగ్గిన కుడిమొరవపై ఇసుకబస్తాలు ఎడమ మొరవపై సిమెంటుతో పెంచిన ఎత్తు
గుమ్మసముద్రం చెరువు పనులు ఇష్టారాజ్యం
రూ.28 లక్షలతో మొరవల పనులు
కుడి మొరవ ఎత్తు తగ్గించి,ఎడమ మొరవ ఎత్తు పెంచారు
గుమ్మసముద్రం చెరువు అభివృద్ధికి సంబంధించి రూ.32 లక్షలతో పనులు చేపట్టేందుకు అధి కారులు చర్యలు తీసుకున్నారు. దీనికి టెండర్లు నిర్వహించగా సురేంద్రనాఽథ్‌రెడ్డి పని దక్కించుకున్నారు. అయితే టెండర్‌దారునికి అప్పగించాల్సిన పనిని అధికారులు కుంటిసాకులతో రద్దు చేసేశారు. తర్వాత ఇదే పనికి టెండర్‌తో పనిలేకుండా రాయచోటికి చెందిన శ్రీనివాసులు అనే కాంట్రాక్టర్‌కు రూ.28.50 లక్షలకు పనిని అప్పగించారు. దీంతో పని ఇష్టమొచ్చినట్టు చేసి పర్సంటేజీలను ఓ టీడీపీ నేతతో కలిసి వాటాలు వేసుకున్నారని విస్త్రృత ప్రచారం జరుగుతోంది. జలవనరులశాఖ వర్గాల్లోనూ ఇదే అంశం చర్చించుకుంటున్నారు.
అడిగేదెవరు.. ఆపేదెవరు


