ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం
రాయచోటి: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి పేర్కొన్నారు. రాయచోటిలోని పార్టీ జిల్లా కార్యాలయంలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈనెల 28న తలపెట్టిన నిరసన ర్యాలీకి సంబంధించిన పోస్టర్ల ఆవిష్కరణలో పార్టీ నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు. స్వాతంత్య్రం వచ్చి నప్పటి నుంచి ప్రభుత్వాలు ఎన్ని మారినా రాష్ట్రంలో కేవలం 12 మెడికల్ కళాశాలలు మాత్రమే ఉన్నాయన్నారు. వీటిలో కూడా మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో మూడు మెడికల్ కళాశాలలు తీసుకువచ్చారన్నారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత 17 మెడికల్ కళాశాలల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారన్నారు. అందులో ఐదు ప్రారంభమై విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని పేర్కొన్నారు. గత ఏడాది రెండో దశలో మరో ఐదు కళాశాలలు ప్రారంభం కావాల్సి ఉన్నా మాకు వద్దని లేఖరాసిన దుర్మార్గమైన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబు నాయుడు నాలుగు సార్లు సీఎం అయినా ఒక్క మెడికల్ కళాశాలను తెచ్చిన దాఖలాలు లేవని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన బినామీలకు మెడికల్ కళాశాలలు అప్పచెప్పాలనుకోవడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా గత ప్రభుత్వంలో నడుస్తున్న పనులు కొనసాగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం మాత్రం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుందని పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నారంటూ మండిపడ్డారు.కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలల విషయంలో మొండి వైఖరిని విడనాడి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిర్వహించాలని ఆకేపాటి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాయచోటి, సుండుపల్లి, వీరబల్లి ప్రాంతాల ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.
28న నియోజకవర్గాల్లో ర్యాలీలు
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి


