కళా ఉత్సవ్ పోటీల్లో ఉమ్మడి కడప జిల్లా విద్యార్థులు
రాయచోటి జగదాంబసెంటర్: విజయవాడలోని మురళి రిసార్ట్స్‌లో గురువారం నుంచి రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్ –2025 పోటీలలో ఉమ్మడి కడప జిల్లా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ విషయాన్ని కళా ఉత్సవ్ జిల్లా నోడల్ ఆఫీసర్ ఎం.నర్సింహారెడ్డి తెలిపారు. ఈ పోటీలకు ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ వెంకటకృష్ణారెడ్డి అధ్యక్షత వహించగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారన్నారు. విద్యార్థులలో సృజనాత్మకత, కళాత్మక నైపుణ్యాలను పెంపొందించడం, కళల ద్వారా తమ ప్రతిభను ప్రదర్శించడానికి విద్యార్థులకు వేదికను అందించడం, ప్రాంతీయ స్థాయిలో కళలను ప్రోత్సహించడం వంటి లక్ష్యాలతో కళా ఉత్సవ్ –2025 రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. గాత్ర, వాద్య సంగీతం, నృత్యం, నాటకం, దృశ్యకళలు, కథాకథనం పోటీల్లో ఉమ్మడి కడప జిల్లా నుంచి 23 మంది పాల్గొని తమ ప్రతిభను కనబరిచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్కార్ట్ ఉపాధ్యాయులు భ్రమరాంబ, ఎబినేజర్ తదితరులు పాల్గొన్నారు.


