
నిబంధనలు ఏఈ ..?
● ఏడు పోస్టులకు ఒక్కడు
● తంబళ్లపల్లె నియోజకవర్గం
జలవనరులశాఖలో విచిత్రం
మదనపల్లె : జలవనరులశాఖలో ప్రభుత్వ పాలన ఎలా ఉందో తెలుసుకోవాలంటే తంబళ్లపల్లె నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. మదనపల్లె ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయ పరిధిలో తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ శాఖలో నియోజకవర్గాన్ని ఒక సబ్‌డివిజన్ ఒక్కో దానికి ఒక డీఈఈ, మండలానికి సంబంధించి ఒక్కో మండలానికి ఒక ఏఈ, నీటిపారుదల ప్రాజెక్టులు ఉంటే వాటికి అదనంగా ఒక ఏఈని నియమిస్తారు. ఈ పద్ధతిలో పాలన సాగుతుంది. ఇది సాధారణమైన విషయమే. అయితే తంబళ్లపల్లె నియోజకవర్గాన్ని మాత్రం ప్రభుత్వం ప్రత్యేకంగా చూస్తోంది. ఎలా చూస్తోందంటే పనిచేస్తున్న వాళ్లని వీళ్లు మా వాళ్లు కాదంటూ సాగనంపేసి..ఒక ఏఈని మాత్రమే ఎంచుకుంది. ఆ ఏఈపైనా ఆరోపణలు ఉన్నా వాటిని డొంట్ కేర్ అంటోంది.
ఒకే ఒక్కడు..
తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఆరు మండలాలు, పెద్దేరు ప్రాజెక్టు ఉన్నాయి. ఒక్కో మండలానికి ఒక ఏఈ చొప్పున ఏడుగురు ఏఈలను నియమించాలి. పెద్దేరు ప్రాజెక్టుకు ఒక ఏఈ ఉండాలి. అయితే ఈ మొత్తం ఏడుగురు ఏఈ పోస్టులను ఒక్కరికే కట్టబెట్టేశారు. తంబళ్లపల్లె ఏఈగా పనిచేస్తున్న సతీష్‌కు మిగిలిన బి.కొత్తకోట, పెద్దతిప్పసముద్రం, ములకలచెరువు, పెద్దమండ్యం, కురబలకోట మండలాలు, పెద్దేరు ప్రాజెక్టులకు ఏఈగా అదనపు బాధ్యతలు చూస్తున్నారు. ఇలా నియమించడానికి నిబంధనలు వరిస్తాయో లేదో కాని ఏఈ సతీష్‌కు మాత్రం వర్తింపజేశారు. ఒక ఏఈకి ఇంకో మండలం అదనంగా ఇవ్వడంలో ఇబ్బందిలేదుకాని పనిచేస్తున్న మండలం కాక మరో ఆరుగురు ఏఈ పోస్టులన్నీ ఆయనకే అప్పగించారు. ఇలాంటి పరిస్థితి పీలేరు, మదనపల్లె నియోజకవర్గాల్లో లేకపోవడం విశేషం.
ఆ ఏఈని పంపేసి..
కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దమండ్యం ఏఈగా పనిచేస్తున్న శ్రీనివాసులురెడ్డిని టీడీపీ నేతలు టార్గెట్ చేశారు. అప్పటికే తంబళ్లపల్లె ఏఈ సతీష్ పనిచేస్తుండగా ఏఈలు లేనందున ఇద్దరికి మూడు మండలాలను అప్పగించారు. అయితే టీడీపీ నేతలు కుటుంబ బంధాలను కూడా రాజకీయాల్లోకి లాగారు. శ్రీనివాసులురెడ్డి తమకు వద్దంటూ టీడీపీ నేతలు ఆయన్ను ఇక్కడికి నుంచి బదిలీ చేసేశారు. దీనితో మిగిలిన ఆరు పోస్టులను సతీష్‌కు అప్పగించగా నియోజకవర్గమంతా ఆయనొక్కరే విధులు నిర్వహిస్తున్నారు. బహుశా రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా ఏడుపోస్టులను ఒక్కరికే అప్పగించడం ఇక్కడే జరిగిందేమో.
ఏం జరిగినా దిక్కులేదు
నియోజకవర్గంలో ఒకే ఏఈ ఉండటంతో అభివృద్ధి పనుల పర్యవేక్షణ,
వర్షాలతో చెరువులకు ప్రమాదం ఏర్పడినా తక్షణ చర్యలు చేపట్టే పరిస్థితులు లేవు. ఇటివల వర్షాలతో చెరువులు నిండి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల చెరువులు ప్రమాదస్థితిలో ఉన్నాయని ఆందోళన వ్యక్తమైంది. ఇలాంటి పరిస్థితులు వస్తే పరిస్థితి ఏటన్నది ప్రభుత్వానికే తెలియాలి.