
రూ.36 లక్షల రుణాల సొమ్ము స్వాహా
మదనపల్లె : మదనపల్లె వెలుగు సమాఖ్యలో రుణాలు, వాటి రికవరీల సొమ్ము అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఓ సంఘమిత్ర రూ.36 లక్షలు స్వాహా చేసిన ఉదంతం మంగళవారం వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళలు, వెలుగు సమాఖ్య అధికారులు, పోలీసు తెలిపిన వివరాలు.
మదనపల్లె మండలం చిన్నతిప్పసముద్రం గ్రామానికి చెందిన గ్రామ సమాఖ్య –4కు సంఘమిత్రగా స్వాతి పని చేస్తున్నారు. ఈమె పరిధిలోని 30 మహిళా సంఘాల నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. ఈ సంఘాలకు వివిధ రకాల రుణాలను మంజూరు చేస్తూ వాటిని రికవరీ చేసి బ్యాంకులు, మండల సమాఖ్య ఖాతాలకు జమ చేయాలి. కొంతకాలంగా మహిళా సంఘాల సభ్యులు బ్యాంకు లింకేజీ, గ్రామ సమాఖ్య, సీ్త్ర నిధి, ఇలా పలు రకాల రుణాలను తీసుకున్నారు. వీటిని ప్రతినెలా తిరిగి కంతులను చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో 22 సంఘాలకు చెందిన మహిళలు గడువు మేరకు సంఘమిత్ర స్వాతికి తాము చెల్లించాల్సిన కంతుల సొమ్మును చెల్లిస్తూ వస్తున్నారు. ఈ సొమ్మంతా తాము తీసుకున్న రుణాలకు జమ అయ్యి అప్పు తీరిపోయిందని భావించారు. అయితే వెలుగు సమాఖ్య అధికారులు ఈ సంఘాలకు చెందిన మహిళలు తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడం లేదని గుర్తించి ఆరా తీశారు. రుణాలు చెల్లించాలని సంబంధిత సంఘాల మహిళలకు సూచించడంతో అసలు వ్యవహారం బయటపడింది. తాము రుణాలన్నీ చెల్లించామని, మళ్లీ ఎందుకు అడుగుతున్నారని మహిళలు ప్రశ్నించారు. ఖాతాలకు సొమ్ము జమ కాని విషయాన్ని వారికి తెలియజేయడంతో సంఘమిత్ర స్వాతికి తాము ఇచ్చిన సొమ్ము చెల్లించలేదని గుర్తించారు. దీంతో తాము ఆర్థికంగా నష్టపోయామని భావించిన మహిళలు మంగళవారం మదనపల్లె రూరల్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఎస్‌ఐ చంద్రమోహన్‌కు ఫిర్యాదు చేశారు. తాము చెల్లించిన రూ.36 లక్షల రుణాల రికవరీ సొమ్ము చెల్లించకుండా స్వాతి తమను మోసం చేసిందని.. తమకు న్యాయం చేయాలంటూ విన్నవించారు. మహిళల ఫిర్యాదు పై స్పందించిన ఎస్‌ఐ విచారణ చేపట్టారు. ఈ విషయంలో వెలుగు సమాఖ్య అధికారులు కూడా విచారణ చేపట్టారు. స్వాతి వ్యవహారంపై చర్యలు తీసుకోనున్నట్లు వెలుగు ఏపీఎం ఖిజర్ ఖాన్ చెప్పారు.
పోలీసులను ఆశ్రయించిన బాధిత మహిళలు