కార్తీకం... శివోహం | - | Sakshi
Sakshi News home page

కార్తీకం... శివోహం

Oct 22 2025 7:00 AM | Updated on Oct 22 2025 7:00 AM

కార్త

కార్తీకం... శివోహం

● కార్తీక విశేషం

శైవ సంప్రదాయాన్ని అనుసరించే వారెక్కువగా శివపూజలు నిర్వహిస్తారు. వైష్ణవ సంప్రదాయంలో నడుచుకునే వారు విష్ణు ప్రతిరూప ఆలయాల బాటపడతారు. మరి శివ,కేశవులిద్దరు కలిసి పూజలందుకునే సందర్భం ఏదైనా ఉందా అంటే అదే కార్తీక మాసం. ఈనెల 22 నుంచి నవంబర్‌ 21వ తేదీ వరకు శివుడికి, విష్ణువుకు నిష్టతో పూజలు చేస్తారు. అందుకే ఈ మాసంలో శైవ,వైష్ణవ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతాయి. ఈ 30 రోజుల దీపారాధన ప్రత్యేకం. దీపారాధన చేయడం ద్వారా భక్తులు పుణ్యాన్ని ఆశిస్తారు. జిల్లాలోని ఆలయాలు దీపకాంతులతో శోభిల్లనున్నాయి. దైవనామస్మరణతో జిల్లా పులకరించనుంది. బుధవారం నుంచి కార్తీకమాసం ప్రారంభం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

రాజంపేట పట్టణంలో పురాతనమైన శివాలయం

మదనపల్లె: సోమేశ్వరుడు

మదనపల్లె సిటీ/రాజంపేట టౌన్‌: కార్తీకమాసాన్ని భక్తులు అత్యంత భక్తిభావాలతో నిర్వహిస్తారు. ప్రముఖ శివాలయాలు మదనపల్లెలోని యోగభోగేశ్వరస్వామి ఆలయం, సోమేశ్వరస్వామి ఆలయం, నిమ్మనపల్లె మండలం తవళంలోని నేలమల్లేశ్వరస్వామి ఆలయం, తంబళ్లపల్లె మల్లయ్యకొండపై వెలసిన భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి ఆలయం, రాయచోటిలోని వీరభద్రస్వామి ఆలయం, ఉమామహేశ్వరి ఆలయం, గండిమడుగు విరూపాక్షమ్మ ఆలయం, రైల్వే కోడూరులోని భుజంగేశ్వరస్వామి ఆలయం, కామేశ్వరితీర్థేశ్వర ఆలయం, అత్తిరాల బుజంగేశ్వర ఆలయం, రైల్వేకోడూరు మల్లికార్జున ఆలయం, సోమేశ్వర ఆలయం, చిట్వేల్‌, కలకడలోని సిద్దేశ్వర ఆలయం , ములకలచెరువులోని చంద్రమౌళి ఆలయం, రామాపురంలోని హసనాపురం శివాలయం, సిద్దవటం మండలంలోని నిత్య పూజకోన, ఒంటిమిట్టలోని ముకుంద మల్లేశ్వరస్వామి ఆలయంతో పాటు పలు శివాలయాలు కార్తీకమాసంలో భక్తుల పూజలందుకునేందుకు సిద్ధం చేశారు. బుధవారం వేకువజామునుంచే కార్తీకస్నానాలు చేసేందుకు భక్తులు సమాయత్తమవుతున్నారు.

శివ, కేశవులకు ప్రీతిపాత్రం..

ఆషాడమాసంలో యోగనిద్రలో పవళించిన శ్రీ మహావిష్ణువును ఈ కార్తీకమాసంలో తులసిదళాలతో పూజిస్తారు. పరమశివుడికి మాహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, బిల్వపత్రాలతో పూజలు నిర్వహిస్తారు. ఓం నమో భగవతే రుద్రాయా... నమస్తే రుద్రాయా... అంటూ లింగాకార భోళాశంకరుడికి అభిషేకాలు చేస్తారు. పంచామృతాభిషేకం శ్రేష్టమైనది. పౌర్ణమి నాడు కొందరు ప్రత్యేకంగా కేదారేశ్వరవ్రతం చేస్తారు. నదులు, చెరువుల్లో స్నానం ఆచరిస్తారు. ఉసరిక పూజలు, వనభోజనాలు, ఉపవాసం చేయడం, కార్తీక దీపాలు వెలిగించడం ఈ మాసంలోనే సాగుతుంటాయి. ఈ మాసం ఉల్లాసానికి, ఉత్తేజానికి ప్రతీక. ధ్యానానికి మహోత్తరమైన మాసం. ఈ మాసంలో ఆహార, నియమాలతో ఉపవాసాలు చేస్తే యోగశక్తిని పొందవచ్చు.

దీపారాధన...

కార్తీకమాసంలో దీపారాధన చేయడం మహా మహోన్నతమైంది. శివాలయంలో లేదా గృహంలోనూ తెల్లవారుజామున, సాయంకాలంలో దీపారాధన చేస్తే దైవానుగ్రహం లభిస్తుంది. ఎవరైనా సరే కార్తీకమాసంలో తెలిసి లేదా తెలియకుండా ఎక్కడైనా దీపం పెట్టినా వారి సర్వ విధ పాపాలు హరిస్తాయని పురాణాల కథనం. జ్ఞానం, మోక్షం, ఇహాన శ్రేయస్సు శుభ ఫలితాలు కలుగుతాయి. ఇదే నెలలో వనభోజనాలు జరుగుతాయి. ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిదంటారు. అంతేకాదు వేకువజామునే ఆచరించే స్నానం వెనుక కూడా ఆరోగ్య సూత్రం దాగి ఉంది. ఉదయాన్నే కురిసే మంచులో తొలిజాములో చేసే పూజాదికాలతో జీవనాడులు ఉత్తేజితమవుతాయి.

దీపమే దైవ స్వరూపం: ‘దీపం జ్యోతి పరబ్రహ్మం’ అంటారు. అంటే దీపమే దైవస్వరూపమని అర్థం. అందుకే లోకాల్లో చీకట్లను తొలగించే దీపారాధనకు కార్తీకమాసంలో ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. అందువల్ల అనేక మంది తమ ఇళ్ళ ముంగిట, శివాలయాల్లో దీపాలను విధిగా వెలిగిస్తారు. ఆవు నెయ్యి, నువ్వుల నూనెతో దీపం వెలిగించడం శ్రేష్టమని పురోహితులు చెబుతున్నారు. ఈమాసంలో స్నానా నికి, దీపానికి అధిక ప్రాధాన్యత ఉంది. అందువల్ల నదీస్నానమాచరిస్తే పునీతులవుతారని భక్తుల విశ్వాసం. కార్తీక మాసంలో శివకేశవులిద్దరికి పూజలు నిర్వహించాలని పురోహితులు చెబుతున్నారు.

కార్తీక పౌర్ణమి విశిష్టత: కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి ఎంతో విశిష్టమైనది. ఈ ఏడాది నవంబర్‌ 5వ తేదీ కార్తీక పౌర్ణమి రానుంది. కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దానం చేయడం వల్ల దారిద్య్రం తొలగిపోతుందని భక్తుల విశ్వాసం. పౌర్ణమి రోజున శివుడికి అభిషేకం చేయడం వల్ల ఆయుష్షు పెరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.

ఉపవాసం.....దానమాసం

కార్తీక మాసంలో భక్తులు ఉపవాసం ఉండేందుకు అలాగే దాన ధర్మాలు చేసేందుకు ప్రాధాన్యత ఇస్తారు. వేకువజామునే స్నానమాచరించడం, దానం చేయడం, శివనామ స్మరణలో ఉండటం వల్ల అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నదీస్నానం, దానధర్మాలు, ఉపవాసాలు, పూజలు, వ్రతాలు, నోములకు ఈ మాసంలో ఎంతో ప్రాధాన్యత ఉంది.

తొలి సోమవారం : అక్టోబర్‌ – 27

రెండవ సోమవారం : నవంబర్‌ – 03

మూడవ సోమవారం : నవంబర్‌ – 10

నాల్గవ సోమవారం : నవంబర్‌ – 17

కార్తీక పౌర్ణమి : నవంబర్‌ – 05

కృత్తికా నక్షత్రంలో పున్నమిచంద్రుడు సంచరించే మాసం కావడంతో ఈమాసానికి ‘కార్తీకం’ అనే పేరు వచ్చిందని పురోహితులు చెబుతున్నారు. కృత్తిక అగ్నిసంబంధ నక్షత్రం కావడంతో కార్తీకమాసంలో దీపారాధనకు విశేష ప్రాధాన్యతవుంది. ముఖ్యంగా శివాలయాల్లో, నదీ తీరాల్లో, ఇళ్లల్లో దీపాలను వెలిగించడం పుణ్యప్రదమని కార్తీక పురాణం చెబుతోంది. కార్తీక మాసంలో దీపం వెలిగించడం, దానం చేయడం వల్ల ఎంతో పుణ్యం సిద్ధిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

ఈఏడాది నాలుగు సోమవారాలు

నేటి నుంచి కార్తీక మాసోత్సవాలు

జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ

భక్తులకు అన్ని ఏర్పాట్లు

కార్తీకమాసంలో శివాలయాల్లో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశాం. భక్తుల రద్దీ దృష్ట్యా క్యూలైన్లు ఏర్పాటు చేశాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయా ఆలయ ఈఓలకు ఆదేశాలు జారీ చేశాం. –విశ్వనాథ్‌, జిల్లా దేవాదాయశాఖ అధికారి

ముక్తికి మార్గం....కార్తీక మాసం

హరిహరులకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కార్తీకం. కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది. అందువల్ల ఈమాసంలోని ప్రతి రోజు మహిమాన్వితమైనదే. ఈమాసంలో నియమనిష్టలతో వేకువజామునే స్నానాలు ఆచరించి, దీపాలు వెలిగించి శివారాధన చేస్తే ముక్తి లభిస్తుంది.

– యతిరాజం హరినాఽథ్‌శర్మ, పురోహితులు, రాజంపేట

శుభఫలితాలు కలుగుతాయి..

కార్తీకమాసంలో దీపారాధన చేయడం ఉత్తమోత్తమం. దీనివల్ల దైవానుగ్రహం లభిస్తుంది. సర్వపాపాలు హరిస్తాయి. భక్తులు నియమాలను తప్పకుండా పాటిస్తే సకల శుభాలు కలుగుతాయి. భగవంతున్ని భక్తిశ్రద్ధలతో పూజించాలి. దీపారాధన చేసి వ్రతం ఆచరించాలి. ఈ విధంగా చేస్తే కష్టాలు తొలుగుతాయి. –ఫణికుమార్‌శర్మ, అర్చకులు, మదనపల్లె

కార్తీకం... శివోహం 1
1/6

కార్తీకం... శివోహం

కార్తీకం... శివోహం 2
2/6

కార్తీకం... శివోహం

కార్తీకం... శివోహం 3
3/6

కార్తీకం... శివోహం

కార్తీకం... శివోహం 4
4/6

కార్తీకం... శివోహం

కార్తీకం... శివోహం 5
5/6

కార్తీకం... శివోహం

కార్తీకం... శివోహం 6
6/6

కార్తీకం... శివోహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement