
బుడ్డా వెంగళరెడ్డి దాతృత్వం స్ఫూర్తిదాయకం
ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి
కడప సెవెన్‌రోడ్స్ : మహాదాత బుడ్డా వెంగళరెడ్డి దాతృత్వం అందరికీ స్ఫూర్తిదాయకమని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి అన్నారు. ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన కుమ్మరి దస్తగిరి రచించిన బుడ్డా వెంగళరెడ్డి జీవిత చరిత్ర పుస్తక పరిచయ కార్యక్రమం రాయలసీమ టూరిజం అండ్ కల్చరల్ సొసైటీ కార్యదర్శి కొండూరు జనార్దన్‌రాజు ఆధ్వర్యంలో ఆదివారం కడప హౌసింగ్‌బోర్డు కాలనీలోని శ్రీ కోదండ రామాలయంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి మాట్లాడుతూ డొక్కల కరువులో తిండి లేక వేలాది మంది రాయలసీమ ప్రజలు మృత్యువాత పడ్డారని పేర్కొన్నారు. అలాంటి సమయంలో బుడ్డా వెంగళరెడ్డి కొన్ని వేల మందికి కొన్ని నెలల పాటు అంబలి పోసి ప్రాణాలు కాపాడారన్నారు. ఆయన దాతృత్వం, సేవల గురించి భావితరాలకు తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కడపలో ఆయన విగ్రహ ఏర్పాటుకు అందరూ ముందుకు రావాలని, తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
పాఠ్యాంశాల్లో చేర్చాలి
ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ బుడ్డా వెంగళరెడ్డి దాతృత్వం, ఆయన చరిత్ర గురించి పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు. అలాగే ప్రభుత్వ పథకాలకు ఆయన పేరు పెట్టాలన్నారు. ఇందువల్ల భావి తరాలు ఆయన గురించి తెలుసుకుని స్ఫూర్తి పొందేందుకు వీలుంటుందన్నారు. ఈ విషయాన్ని తాను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని తెలిపారు.
వర్సిటీలు పరిశోధనలు జరపాలి
రాయలసీమ కార్మిక కర్షక సమితి అధ్యక్షులు సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ రాయలసీమకు చెందిన బుడ్డా వెంగళరెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డిలతోపాటు ఎందరో మహానీయుల సేవలు, త్యాగాలను వెలుగులోకి తీసుకు వచ్చేందుకు విశ్వవిద్యాలయాలు పరిశోధనలు చేపట్టాలని అన్నారు. వారి జీవితం, సేవల గురించి ప్రభుత్వం కూడా విస్తృత ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు. నందన, డొక్కల, ధాతు వంటి భయానక కరువుల్లో రాయలసీమ ప్రజలు అనుభవించిన ఆవేదన, కన్నీళ్లు, అవమానాలు లాంటి అంశాల గురించి బ్రిటీషు గెజిటీర్లు, చరిత్ర పుస్తకాల్లో లేవన్నారు. ఆ విషయాలను చరిత్ర పరిశోధకులు వెలుగులోకి తీసుకు రాగలిగితే రాయలసీమ యువత ఈ ప్రాంత అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున ముందుకు వచ్చే అవకాశం ఉంటుందన్నారు.
ఘనంగా సన్మానం
పుస్తక రచయిత దస్తగిరి, బుడ్డా వెంగళరెడ్డి ఐదవ తరం వారసులు బుడ్డా విష్ణువర్దన్‌రెడ్డి, ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన కవి కర్నాటి రామకృష్ణారెడ్డి, పుస్తక సమీక్షకులు జీవీ సాయిప్రసాద్, రెడ్డి సేవా సమితి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పద్మప్రియ చంద్రారెడ్డి, యూ ట్యూబర్ దండా ప్రసాద్‌లను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్రీ కోదండ రామాలయ ధర్మకర్త దేసు వెంకటరెడ్డి, కడప నగర డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు మోపూరి బాలకృష్ణారెడ్డి, ఇంటాక్ జాతీయ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు లయన్ కె.చిన్నపరెడ్డి, లయన్స్ క్లబ్ ఆఫ్ కడప అన్నమయ్య జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఆర్.రంగనాథరెడ్డి, నగర ప్రముఖులు పోతుల వెంకట్రామిరెడ్డి, వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, మానవత సంస్థ ప్రతినిధులు డాక్టర్ రామాంజులరెడ్డి, ఆచార్య సాంబశివారెడ్డి, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి
కార్యక్రమంలో పాల్గొన్న సాహితీ ప్రియులు

బుడ్డా వెంగళరెడ్డి దాతృత్వం స్ఫూర్తిదాయకం