
పెన్నాలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
సిద్దవటం : పెన్నా నదిలో గల్లంతైన వ్యక్తి మృతదేహం ఆదివారం లభ్యమైంది. సిద్దవటం మండలంలోని వంతాటిపల్లి ఎస్సీ కాలనీకి చెందిన పెయ్యల నందు(36) గ్రామ సమీపంలోని పెన్నా వద్దకు తన పెంపుడు కుక్కతో శనివారం మధ్యాహ్నం వెళ్లారు. నదిలో చేపలు ఎగురుతుండటంతో.. వాటి కోసం కుక్క అందులోకి దూకింది. కుక్కను రక్షించేందుకు పెన్నా నీటిలో దిగి సుడిగుండంలో చిక్కుకొని గల్లంతైన విషయం తెలిసిందే. ఒంటిమిట్ట సీఐ బాబు ఆధ్వర్యంలో గజ ఈతగాళ్లు, కడప రెస్క్యూ టీమ్ వారు శనివారం సాయంత్రం వరకు గాలింపు చర్యలు చేపట్టారు. మరలా ఆదివారం ఉదయం గాలింపు చర్యలు చేపట్టగా సిద్దవటం మండలం ఎస్.రాజంపేట గ్రామ సమీపంలోని పెన్నా నదిలో నందు మృతదేహం లభ్యమైంది. మృతుడికి భార్య పూజ, మూడేళ్ల కుమార్తె ఉంది. భార్య 8 నెలల నిండు గర్భిణి. కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ఝరికోనలో పడి వ్యక్తి మృతి
కలకడ : ఝరికోన ప్రాంతంలో ఆహ్లాదంగా గడపడానికి కుటుంబంతో వచ్చిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు ఝరికోనలో పడి మృతి చెందిన ఘటన ఆదివారం మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు... సంబేపల్లె మండలం దేవపట్లకు చెందిన అజమతుల్లా(30) తన కుటుంబ సభ్యులతో ఝరిగడ్డ ప్రాంతానికి కుటుంబంతో కలిసి వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తు జారి కాలువలో పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే 108 వాహనానికి సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది అజమతుల్లాను కలకడ పీహెచ్‌సీకి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం మహల్ సీహెచ్‌సీకి తరలించగా పరీక్షించిన వైద్యులు.. అజమతుల్లా మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

పెన్నాలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం