
లక్కిరెడ్డిపల్లి, చిన్నమండెం మండలాలు పైలెట్ ప్రాజెక్టు
రాయచోటి: వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయంలో మార్పులు.. పైలెట్ ప్రాజెక్టుకు జిల్లాలోని లక్కిరెడ్డిపల్లి, చిన్నమండెం మండలాలు ఎంపిక కావడం సంతోషకరమని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. రైతులు వాతావరణ మార్పులు వల్ల కలిగే ప్రభావాలకు సన్నద్ధంగా ఉండి ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. బుధవారం రాయచోటి కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో కలెక్టర్ ఆధ్వర్యంలో యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ రెండు రోజుల జిల్లాస్థాయి వర్క్‌షాప్‌లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఉపాధి మార్గాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇండియాలో ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మూడు రాష్ట్రాల్లో పైలెట్ ప్రోగ్రామ్‌గా ఎంపిక కావడం.. అందులో రాష్ట్రంలో అన్నమయ్య జిల్లాలోని వెనుకబడిన మండలాలుగా ఉన్న లక్కిరెడ్డిపల్లి, చిన్నమండెం ఎంపిక కావడం ఆనందించ దగ్గ విషయమన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణంలో మార్పులు రావడం పెద్ద సమస్యగా మారిందన్నారు. వర్షాలు కురిసే కాలంలో తక్కువగా ఉండటం, పంటలు పండే సమయంలో వర్షాలు రాకుండా ఆగిపోవడం, అలాగే చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలతో పంట నష్టం జరుగుతోందన్నారు. ఇలా వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతింటోందన్నారు. లక్కిరెడ్డిపల్లి, చిన్నమండెం మండలాలలో రైతుల జీవనాధార కార్యక్రమాలు, పంట పద్దతులు, వాతావరణ పరిస్థితులు తదితర అంశాలపై సమగ్ర అధ్యయనం చేసి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రైతులు, అధికారులు కలిసి ఒక సమగ్ర యాక్షన్ ప్లాన్ రూపొందించి ఈ ప్రాజెక్టు ద్వారా గరిష్ట ప్రయోజనం పొందేలా కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జాతీయ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ బాలాజీ త్రిపాఠి మాట్లాడుతూ ఈ పథకం మనదేశంలో మూడు రాష్ట్రాల్లో అమలవుతోందని, ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాలోని చిన్నమండెం, లక్కిరెడ్డిపల్లి మండలాలలోని ఇరవై గ్రామాలలో రైతుల జీవన విధానం, మార్పులకు దోహదమవుతుందని తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా వ్యవసాయ అధికారి జి శివనారాయణ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో వర్షాభావ పరిస్థితుల వల్ల రైతాంగం వరుస కరువులను చవిచూడాల్సిన పరిస్థితి వస్తోందని,, వీటిని ప్రత్యామ్నాయంగా ఈ పథకం ద్వారా గ్రామస్థాయిలోని సన్నకారు రైతులకు ఉపయోగపడే విధంగా రూపకల్పన చేయాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయ రైతు సాధికార సంస్థప్రతినిధి సౌమ్య జిల్లా ప్రకృతి వ్యవసాయాధికారి బి వెంకట మోహన్, జిల్లా ఉద్యానశాఖ అధికారి సుభాషిణి, జిల్లా పిషరీస్ డిపార్టుమెంట్ అధికారి సుష్మిత తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్