
పడకేసిన వైద్యం
రాయచోటి/ఓబులవారిపల్లె: కూటమి ప్రభుత్వ హయాంలో వైద్యానికి సుస్తీ చేసింది.రెండేళ్ల క్రితం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నతంగా వెలిగిన ప్రభుత్వ రంగ వైద్యం ఇప్పుడు దీనావస్థలో ఉంది. ఆరోగ్యంగా ఉన్న వైద్యాన్ని అనారోగ్యం పాలు చేసి మంచం పట్టేలా చేయడంలో కూటమి సర్కార్ సఫలీకృతమైంది. సమస్యల పరిష్కారానికి గత నెల 26వ తేదీ నుంచి దశల వారీగా ఏపీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోషియేషన్ (ఏపీ పీహెచ్‌సీ డీఏ) ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. 2024 సెప్టెంబర్‌లో కూడా వైద్యులు సమ్మె చేశారు. ప్రభుత్వం చర్చలకు ఆహ్వనించి, సమస్యలను పరిష్కరిస్తామని హమీ ఇచ్చింది. ఏడాది దాటినా హామీలు అమలుకాకపోవడంతో మరోమారు వైద్యులు ఆందోళన బాట పట్టారు.జ్వరాలతో ఆస్పత్రికి వచ్చే రోగులకు సరైన వైద్యం కరువైంది.ప్రభుత్వం సరైన ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు డెంటల్, స్కిన్, ఆర్తో, కంటి వైద్య నిపుణులను అక్కడక్కడా ఏర్పాటుచేసిన ఫలితాలు కనిపించలేదు.చాలాచోట్ల నర్సులు, సిబ్బంది అందిస్తున్న వైద్యంతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. బుధవారం ఓబులవారిపల్లె మండలం ముక్కావారిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి రాకపోవడంతో రోగులు చాలాసేపు వేచి ఉండాల్సి వచ్చింది. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతున్న కారణంగా ప్రజలు రోగాల బారిన పడి ప్రభుత్వ వైద్య, ఆరోగ్య కేంద్రాలకు వెళ్తున్నారు. అక్కడ వైద్య సేవలు అందకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ వైద్యాధికారుల సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
కొనసాగుతున్న పీహెచ్‌సీ వైద్యుల సమ్మె
వైద్యం అందక గ్రామీణులకు అవస్థలు