
నూతన కమిటీ ఏర్పాటు
సిద్దవటం: మండలంలోని వంతాటిపల్లి గ్రామం సమీపంలోని లంకమల అడవుల్లో వెలసిన శ్రీ నిత్యపూజ స్వామి ఆలయం నూతన ధర్మకర్తల మండలిని కమిషనర్ దేవాదాయ శాఖ విజయవాడ వారు నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. ఈమేరకు ఆలయ కార్యనిర్వహణాధికారి ఏ.శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయ ఛైర్మన్‌గా జంగిటి రాజేంద్రప్రసాద్‌యాదవ్, సభ్యులుగా పి.మల్లీశ్వరి, పి.వసంత, బి.వెంకటసుబ్బయ్య, వి.కృష్ణయ్య, ఆర్.పార్వతమ్మ, సి.వెంకటసుబ్బయ్య, కె.రాజేశ్వరి, జె.శివారెడ్డి, కె.రూప నియమితులైనట్లు ఆయన తెలిపారు.
రాయచోటి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే జీఎస్టీ తగ్గింపును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సూచించారు. శుక్రవారం రాయచోటిలోని పంక్షన్‌హాల్‌లో జిల్లా వాణిజ్య పన్నులశాఖ, పరిశ్రమల శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ వస్తువులను జీఎస్టీ తగ్గింపుపై సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన, ఎగ్జిబిషన్ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. జీఎస్టీ తగ్గింపు వల్ల ఎలక్ట్రానిక్ వస్తువులైన ఫ్రిజ్, మైక్రోవేవ్ ఓవెన్ టీవీలు, వాషింగ్ మెషిన్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తక్కువ ధరకే ప్రజలకు అందుబాటులో ఉంటాయని ఈ సౌకర్యాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, వాణిజ్య పన్నులశాఖ, పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొన్నారు.
మదనపల్లె సిటీ: న్యూఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి మొదటి పారా యోగసనా స్పోర్ట్స్’ ఛాంపియన్‌షిప్–2025లో స్థానిక వెలుగు ప్రత్యేక పాఠశాల విద్యార్థిని జి.మధులత అండర్–17 బాలికల విభాగంలో ప్రతిభ కనబరించింది.ద్వితీయ స్థానం దక్కించుకుని సిల్వర్ మెడల్ కై వసం చేసుకుంది. శుక్రవారం పాఠశాలలో అభినందన సభ ఏర్పాటు చేశారు. యోగసన భారత్ పోటీలు మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ యోగా ప్రాంగణంలో పోటీలు నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి దివ్యాంగులు పాల్గొన్నారు. వెలుగు కన్వీనర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ దివ్యాంగురాలైన మధులత యోగా మాస్టర్ అనిత వద్ద శిక్షణ తీసుకున్నట్లు పట్టుదలతో జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వెలుగు సెక్రటరీ ఉదయమోహన్‌రెడ్డి, ప్రిన్సిపాల్ లీనాకుమారి తదితరులు పాల్గొన్నారు.