
వెంటిలేటర్‌పై పేదల ఆరోగ్యం
రాయచోటి: ‘ఎన్‌టీఆర్ వైద్యసేవ’ (ఆరోగ్యశ్రీ) పథకం అస్తవ్యసగా మారింది. ఈ పథకంలో భాగంగా కార్పొరేట్ నెట్ వర్క్ ఆసుపత్రుల్లో పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించడమే ప్రధాన ఉద్దేశం. అయితే ప్రభుత్వం ఈ నెట్ వర్క్ ఆసుపత్రులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో పెండింగ్ బిల్లులు రూ.కోట్లల్లో పేరుకుపో యాయి. దీంతో ఆసుపత్రుల యాజమాన్యాలు ‘బకాయిలు చెల్లిస్తే గాని తాము కోలుకోలేము..పేదలకు ఉచిత వైద్యం అందించలేము’ అని చెప్పాయి.
● ప్రైవేట్ నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో గడిచిన సెప్టెంబర్ నెలలో ఉచిత ఓపీ సేవలను నిలిపేసి తమ నిరసనను తెలిపారు. తాజాగా శుక్రవారం నుంచి పూర్తిగా అన్ని వైద్యసేవలను నిలుపుదల చేశారు. ప్రైవేట్ నెట్‌వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు గత్యంతరం లేక సంపూర్ణంగా వైద్యసేవలను బంద్ చేశారు. గుండె, న్యూరో తదితర పెద్ద జబ్బులకు ప్రైవేట్ నెట్‌వర్క్ ఆసుపత్రుల్లోనే వైద్యసేవలు లభిస్తాయి. ఇప్పుడు పూర్తిగా వైద్యసేవలను నిలుపుదల చేయడంతో పేదల బాధలు వర్ణనాతీతంగా మారాయి.
● సూచనలు, సలహాలు ఇవ్వడానికి నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో వైద్యమిత్రల డెస్క్ ఉంటుంది. ఇక్కడికి యథాలాపంగా వచ్చే రోగులకు వైద్యమిత్రల బంద్ జరుగుతోంది. వైద్యసేవలు అందుబాటులో లేవు. మీరంతా రాయచోటి, మదనపల్లె రాజంపేట, పీలేరు పట్టణాల్లోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి లేదా ఇతర ప్రభుత్వాసుపత్రులకు వెళ్లండని సలహా ఇస్తున్నారు. దీంతో పెద్ద జబ్బు అయితే కడప రిమ్స్, తిరుపతి, మదనపల్లె జిల్లా ఆసుపత్రితో పాటు ఇతర ప్రభుత్వాసుపత్రులకు వెళ్తున్నారు. చిన్న సమస్య అయితే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తున్నారు. ఇక్కడ డాక్టర్ ఫీజు వంద రూపాయల నుంచి రూ.300 పైగా చెల్లిస్తున్నారు. వైద్య పరీక్షలకు ఎంత లేదన్నా రూ.300 నుంచి రూ.2 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. అదే స్కానింగ్‌కు అయితే రూ.7 వేల వరకు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిలాలో డెంగీ, టైఫాయిడ్ జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో వైద్యసేవల బంద్‌తో చాలా ఇబ్బందులు పడుతున్నారు.
ప్రైవేట్ నెట్ వర్క్ ఆసుపత్రుల్లో
పూర్తిగా నిలిచిన వైద్య సేవలు
‘ఎన్టీఆర్ వైద్య సేవ’లపై ‘పచ్చ’ నీడలు