
మాదక ద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు
రాయచోటి: జిల్లాలో మాదక ద్రవ్యాలను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో మాదక ద్రవ్యాల జిల్లాస్థాయి కమిటీ సమావేశాన్ని జిల్లా ఎస్పీ ధీరజ్ కునిబిల్లితో కలిసి కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా వాటి వినియోగం వల్ల కలిగే అనర్థాలపై విస్తృత అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎస్పీ మాట్లాడుతూ యాంటీ డ్రగ్స్‌పై జిల్లాలో ఇప్పటి వరకు గ్రామాల్లో డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమంపై అవగాహన కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. జనవరి 1 నుంచి అక్టోబర్ 10 వరకు 8 గంజాయి కేసులు పెట్టి 51.05 కేజీలు సీజ్ చేసినట్లు చెప్పారు. 38 మంది నిందితులను గుర్తించి వారిలో 33 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. అనంతరం డ్రగ్స్, గంజాయి నేరం, డ్రగ్స్ వద్దు స్కిల్ ముద్దు, డ్రగ్స్ వద్దు బ్రో, పోస్టర్లను జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ తదితరులు ఆవిష్కరించారు.
● ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరగకుండా జిల్లాలో సామాజిక రుగ్మతలను సమూలంగా తొలగించడమే లక్ష్యంగా పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీకి సంబంధించిన కేసులలో బాధితులకు న్యాయంతోపాటు త్వరితగతిన కేసులను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీకి సంబంధించిన కేసులకు సంబంధించి ఎక్కడ అన్యాయం జరగకుండా పోలీసుశాఖ తరపున చర్యలు తీసుకుంటామన్నారు.