
‘పీఎం ధనధాన్య కృషి యోజన’జిల్లాకు ఒకవరం
రాయచోటి: ప్రధాన మంత్రి ధనధాన్య కృషి యోజన కార్యక్రమం జిల్లాకు వరం కానుందని 20 పాయింట్ల కార్యక్రమం చైర్మన్ లంక దినకర్ పేర్కొన్నారు. శుక్రవారం రాయచోటి కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో కలెక్టర్ నిశాంత్ కుమార్‌తో కలిసి అక్టోబర్ 11న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రారంభించే ప్రధాన మంత్రి ధనధాన్య కృషి యోజన కార్యక్రమంపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఏపీలో నాలుగు జిల్లాలను ఇందులో భాగస్వామ్యం చేసినట్లు, జిల్లాకు చోటు లభించడం అతిపెద్ద వరమని లంక దినకర్ అన్నారు. ఈ పథకం ద్వారా 2025–26 ఆర్థిక సంవత్సరం నుంచి ఆరేళ్లపాటు ఏటా రూ. 24 వేల కోట్లు కేటాయిస్తారన్నారు. వ్యవసాయంలో తక్కువ ఉత్పాదకత, క్లిష్టతర వ్యవసాయ పరిస్థితులు, సగటున తక్కువ వ్యవసాయ రుణాలు తీసుకునే పరిస్థితులు ఉండే జిల్లాను ఆకాంక్షిత వ్యవసాయ జిల్లాగా తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వ్యవసాయ ఉత్పాదకత పెంపు, వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా పంటల మార్పు, సానుకూల వ్యవసాయ పద్దతులను అనుకరించేలా చేయడం, పంచాయతీ, బ్లాక్ స్థాయిలో పంటకోత, అంతర పంట నిల్వకు అవసరమైన చర్యలు, నీటి వనరుల లభ్యతను పెంచడం, స్వల్ప, దీర్ఘకాలిక రుణాల లభ్యత అనే ఐదు లక్ష్యాలతో ఈ పథకం అమలవుతుందన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాన మంత్రి ధనధ్యాన కృషి యోజన కార్యక్రమానికి జిల్లా ఎంపిక కావడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వ్యవసాయం, పాడి పరిశ్రమ, ఉద్యానవనం, ఇతర అనుబంధ రంగాలు జిల్లాలో అభివృద్ధి చెందుతాయని ఆకాంక్షించారు.
● 20 పాయింట్ల కార్యక్రమం చైర్మన్ లంక దినకర్