
సంబేపల్లెలో చోరీ
సంబేపల్లె : మండల కేంద్రంలోని జాతీయ రహదారి పక్కన నివాసం ఉంటున్న చింతం రంగారెడ్డికి చెందిన ఇంట్లో గురువారం రాత్రి పన్నెండు గ్రాముల బంగారం చోరీ అయినట్లు పోలీసులు తెలిపారు. రంగారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరుకు వెళ్ళడంతో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగులకొట్టి ఇంటిలోకి ప్రవేశించి పది గ్రాముల గొలుసు, రెండు గ్రాముల ఉంగరాలు దొంగలించుకు పోయినట్లు పోలీసులు తెలిపారు. ఎస్‌ఐ రవికుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
ముగ్గురిపై కేసు నమోదు
పెద్దతిప్పసముద్రం : తాగునీటి విషయంలో ఓ వ్యక్తిని కట్టెతో దాడి చేసిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ హరిహరప్రసాద్ శుక్రవారం పేర్కొన్నారు. ఎస్‌ఐ కథనం మేరకు మండలంలోని రాపూరివాండ్లపల్లి పంచాయతీ నాగన్నకోటకు చెందిన తండ్రీ, కొడుకులైన మల్లికార్జున, చరణ్, మధులు కలసి అదే గ్రామానికి చెందిన గండికోట వెంకటేష్‌పై దాడి చేసి గాయపరిచారన్నారు. బాధితుడి భార్య సరస్వతి ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
వేడినీళ్లు మీద పడి
బాలుడికి తీవ్రగాయాలు
మదనపల్లె రూరల్ : వేడినీళ్లు మీద పడి బాలుడు తీవ్రంగా గాయపడిన ఘటన శుక్రవారం ములకలచెరువు మండలంలో జరిగింది. వేపూరికోటకు చెందిన నాగరాజ, సుహాసిని దంపతుల కుమారుడు పృథ్వీ(5) ఇంట్లో ఆడుకుంటుండగా, స్టవ్‌పై అన్నం వండేందుకు ఉంచిన వేడినీళ్లు ప్రమాదవశాత్తు శరీరం మీద పడ్డాయి. దీంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబసభ్యులు వెంటనే బాధితుడిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చి చికిత్సలు చేయించారు.
రోడ్డు ప్రమాదంలో
ముగ్గురికి..
మదనపల్లె రూరల్ : ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొని ముగ్గురు తీవ్రంగా గాయపడిన ఘటన శుక్రవారం మదనపల్లె మండలంలో జరిగింది. మండలంలోని వేంపల్లె పంచాయతీ జంగాలపల్లెకు చెందిన నారాయణ(50) శుక్రవారం సాయంత్రం పట్టణంలోని ఓ కాలేజీలో చదువుతున్న తన కుమార్తె భావన(20)ను బైక్‌లో ఎక్కించుకుని ఇంటికి వస్తుండగా, చిప్పిలి సమీపంలో బెంగళూరు నుంచి రాయచోటికి వెళుతున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మల్లిక (28) వేగంగా వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, గమనించిన స్థానికులు బాధితులను ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.