
కూటమి అరాచకాలను అరికడదాం
రైల్వేకోడూరు: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆగడాలని అడ్డుకుందామని రైల్వేకోడూరు మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు.శుక్రవారం తిమ్మిశెట్టిపల్లి అరుంధతివాడలో వైఎస్సార్‌సీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను గ్రామస్తులతో కలిసి ఆవిష్కరించి రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, దోచుకోవడం పరిపాటిగా మారిందన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రాష్ట్రానికి 17 మెడికల్ కళాశాలలు తీసుకొస్తే అందులో ఏడు కళాశాలల నిర్మాణం పూర్తి చేసి పనులు నిర్మాణ దశలో ఉండగానే కమీషన్లకు కక్కుర్తిపడి వాటిని పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో వాటికి వ్యతిరేకంగా ప్రజా అభిప్రాయ సేకరణ పేరుతో ముందుకు వచ్చామన్నారు. 45 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సంతకాలు చేసి తమ అభిప్రాయాలను తెలియజేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో కోడూరు ఎంపీపీ ధ్వజారెడ్డి, పుల్లంపేట మండల కన్వీనర్ ముస్తాక్, పుల్లంపేట ఎంపీపీ ముద్దా బాబుల్ రెడ్డి, చిట్వేలి మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్ రెడ్డి, పంజం వేణుగోపాల్ రెడ్డి, గుత్తి హరినాథ్ రెడ్డి, వెంకటరెడ్డి, రాయలసీమ జోన్ బూత్ కమిటీ అధ్యక్షులు భరత్ కుమార్ రెడ్డి, జెడ్పీటీసీ రత్నమ్మ, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ సుబ్బరామరాజు, స్టేట్ ఎగ్జిక్యూటీవ్ మెంబర్ నందా బాల, సీహెచ్ రమేష్, నాగేంద్ర, ధనుంజయ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు