
ప్రజారవాణాలో ఆటోడ్రైవర్ల పాత్ర కీలకం
మదనపల్లె రూరల్: ప్రజారవాణా వ్యవస్థలో ఆటో డ్రైవర్ల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్ అన్నారు. శనివారం రవాణాశాఖ ఆధ్వర్యంలో మదనపల్లెలో నిర్వహించిన ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి సంబంధించి జరిగిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్, ఎమ్మెల్యే షాజహాన్‌బాషా, సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లు పట్టణాల్లో సేవలందించడమే కాకుండా గ్రామాలు, పట్టణాలను కలిపే కీలక పాత్రను పోషిస్తున్నారన్నారు. విద్యార్థిదశలో తనకు ఆటో డ్రైవర్లతో ఏర్పడిన భావోద్వేగ బంధాన్ని మరచిపోలేనన్నారు. సివిల్ సర్వీసెస్‌కు ఇంటర్వ్యూకు వెళ్లేటప్పుడు తన ఆందోళనను గుర్తించిన ఆటోడ్రైవర్, ఇచ్చిన మానసిక ధైర్యం నేటికీ మరచిపోలేనన్నారు. ఆటోడ్రైవర్లు ప్రభుత్వం అందిస్తున్న 15వేల ఆర్థికసహాయాన్ని కుటుంబ అభివృద్ధికి వినియోగించుకోవాలన్నారు. ఆటోడ్రైవర్ల సేవలో పథకానికి సంబంధించి అన్నమయ్యజిల్లా వ్యాప్తంగా మొత్తం 8,835 మంది ఆటో డ్రైవర్లకు రూ.13.25 కోట్ల రూపాయల నగదు జమచేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే షాజహాన్‌బాషా సబ్‌కలెక్టర్ చల్లా కల్యాణి, ఆర్టీఓ అశోక్‌ప్రతాప్, ఎంవీఐ దినేష్‌చంద్ర, మున్సిపల్ కమిషనర్ కే.ప్రమీల, ఏఎంవీఐలు శివలింగయ్య, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ నిశాంత్‌కుమార్