
మైండ్ గేమ్!
సాక్షి ప్రతినిధి, కడప: ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు సృష్టించడంలో టీడీపీ నేతలకు మరెవ్వరూ సాటిరారు. తాజాగా కడప కార్పొరేషన్‌లోనూ ఇదే పద్ధతి అవలంబిస్తున్నారు. రాజకీయ అలజడితో లబ్ధి పొందాలనే కొత్త కుట్రలకు తెరతీశారు. తమ్ముళ్ల ఎత్తుగడలకు ఎల్లో మీడియా వంతపాడుతోంది. కడప మేయర్‌కు సంబంధించి ఉన్నత న్యాయస్థానంలో వ్యవహారం నడుస్తోంది. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎమ్మెల్యేకు హైకోర్టు ఉత్తర్వులున్నాయి. ఇప్పటికిప్పుడే కోర్టులో వ్యవహారం తేలిపోయే అవకాశం లేదు. అయినప్పటికీ మేయర్ ఎన్నిక, వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు మధ్య బహుముఖ పోటీ అంటూ తెలుగుతమ్ముళ్లు మైండ్‌గేమ్ ఆడుతున్నారు.
● కడప మేయర్ సురేష్‌బాబుపై ప్రభుత్వం అనర్హత వేటు వేసింది. డిప్యూటీ మేయర్ ముంతాజ్‌బేగంకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వం అనర్హత చర్యలపై మాజీ మేయర్ సురేష్‌బాబు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఈనెల 7కు వాయిదా వేస్తూ, ఆ రోజు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా ప్రిన్సిపల్ సెక్రెటరీ, ఫిర్యాదుదారు కడప ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేశారు. కౌంటర్ దాఖలైన తర్వాత ఇరుపక్షాల వాదనల అనంతరం ఫైనల్ తీర్పు వెలువడనుంది. ఈతతంగం ముగిసేంత వర కూ మేయర్ ఎన్నిక ఉత్పన్నమయ్యే అవకాశమే లేదు. ఇదిలాఉంటే... వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల మధ్య అలజడి లేపేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు కుయుక్తులు పన్నుతున్నారు. కడప మేయర్ సీటు కోసం వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల మధ్య బహు ముఖ పోటీ అంటూ పచ్చ నేతలు తానా అంటుంటే.. ఆ రెండు పత్రికలు తందాన అంటూ వంత పాడుతున్నాయి.
● ‘అదిగో పులి అంటే ఇదిగో తోక’అన్నట్లుగా టీడీపీ నేత లు, ఎల్లోమీడియా వైఖరి ఉందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు పేర్లు వారే ప్రకటించడం, వారే ప్రచారం చేయడం ఒకదాని వెంట ఒకటి తెరపైకి వస్తున్నాయి.
మేయర్ ఎన్నిక, పోటీలో పలువురు కార్పొరేటర్లంటూ కొత్త పల్లవి