
పల్లె వైద్యంపై సమ్మెట
రాయచోటి: ఏపీ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారానికి వైద్యులు చేపట్టిన ఆందోళన శనివారం నాటికి తొమ్మిదో రోజుకు చేరింది. ఆసుపత్రుల్లో ఉండాల్సిన వైద్యులు విజయవాడలో తలపెట్టిన నిరసన కార్యక్రమానికి హాజరయ్యారు. దశలవారీగా చేపడుతున్న ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా గతనెల 26వ తేదీ నుంచి వైద్యులు విధులను బహిష్కరించి ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. దీంతో గ్రామీణుల ఆరోగ్యం ఆగమ్యగోచరంగా మారింది.
అరకొర ప్రత్యామ్నాయం
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు సమ్మె తలపెట్టడంతో ప్రభుత్వం చేపట్టిన ప్రత్యామ్నాయ చర్యలు తగినంత ఫలితాలు ఇవ్వలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు డెంటల్, స్కిన్, ఆర్తో, కంటి వైద్య నిపుణులను అక్కడక్కడ ఏర్పాటు చేసినా ఫలితాలు కనిపించలేదు. దీంతో ఆసుపత్రికి వచ్చిన వారు నర్సులు, సిబ్బంది అందిస్తున్న వైద్యంతో సరిపెట్టుకోవాల్చి వచ్చింది. జిల్లాలో 30 మండలాల్లో మొత్తం 51 పీహెచ్‌సీలు ఉన్నాయి. బంద్ కారణంగా వీటిల్లో వైద్యుల కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీంతో స్థానికులు వైద్యం కోసం పట్టణాల్లోని ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తున్నారు. మరికొందరు సమీపంలోని ఆర్‌ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వ వైద్యం పడకేయడంతో పల్లె వాసులు అవస్థలు పడుతున్నారు.
సమ్మెను విఫలం చేసేందుకు యత్నాలు
ఇన్ సర్వీసు పీజీ కోటాను పునరుద్ధరించాలి, టైమ్ బౌండ్ పదోన్నతలు అమలు చేయాలి, పీహెచ్‌సీ వైద్యులకు కచ్చితమైన పని గంటలను నిర్దేశించాలంటూ వైద్యులు సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెలో జిల్లా వ్యాప్తంగా పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న వైద్యులు విధులను బహిష్కరించి సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం ఈ సమ్మెను విఫలం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి తదితర ప్రభుత్వ విభాగాల నుంచి కొంతమంది వైద్యులను పీహెచ్‌సీలకు పంపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా టీడీపీ కూటమి పాలకులు ఏమాత్రం స్పందించకపోవడం పట్ల గ్రామీణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలను పరిష్కరించి సమ్మె విరమణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
గ్రామీణులకు లభించని వైద్య సేవలు
తొమ్మిదోరోజుకు చేరినపీహెచ్‌సీ వైద్యుల ఆందోళన
చోద్యం చూస్తున్న కూటమి పాలకులు
అందరి మద్దతు కోరుతాం..
సమ్మెకు ఇతర ప్రభుత్వ వైద్యులు, ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రైమరీ ఆరోగ్య కేంద్రాలకు వస్తున్న వైద్యుల మద్దతును కూడా కోరుతాం. న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాం. –రమేష్ బాబు,
ఏపీ ప్రైమరీ హెల్త్ సెంటర్
డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు

పల్లె వైద్యంపై సమ్మెట