
జిల్లాలో వర్షం
నీట మునిగిన బస్డాండ్
రాయచోటి: ఉపరితల ఆవర్తనం కారణంగా జిల్లాలో శనివారం వర్షం కురిసింది. పీలేరులో 84.2 మిల్లీమీటర్లు,సుండుపల్లిలో 28 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.జిల్లాలోని రామసముద్రం, నిమ్మనపల్లి, మదనపల్లె, వాల్మీకిపురం, కలికిరి, కలకడ, కేవీపల్లి, గుర్రంకొండ, రాయచోటి ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.
తెగిన చెరువు కట్ట..దెబ్బతిన్న పంట పొలాలు
పీలేరు రూరల్: పీలేరు – మదనపల్లె మార్గంలో నాలుగులేన్ల రహదారి విస్తరణలో భాగంగా నిర్మాణం కోసం కొత్తచెరువును తవ్వి వదిలేశారు. శనివారం కురిసిన భారీ వర్షానికి నీరు ఎక్కువుగా చెరువులోకి చేరుకోవడంతో కట్టతెగిపోయింది. దీంతో దిగువన ఉన్న పంటపొలాలు దెబ్బతిన్నాయి. వరి, టమాట, ఆకు కూరలు తదితర పంటలకు నష్టం వాటిల్లింది. భూములు కోతకు గురయ్యాయి. సమాచారం అందుకున్న తహసీల్దార్ శివకుమార్, ఇరగేషన్ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కట్ట పనులు వెంటనే చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. పీలేరు, సదుం మండలాల్లోని ఎగువ ప్రాంతాల్లో వర్షం విస్తారంగా కురిసింది.దీంతో పింఛా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నూనెవాండ్లపల్లె మార్గాన్ని తహసీల్దార్ శివకుమార్, సీఐ యుగంధర్ పరిశీలించి రాకపోకలు నిలుపుదల చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పీలేరు: పీలేరులో శనివారం తెల్లవారుజాము నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పట్టణంలోని రోడ్లపై నీరు నిలిచింది.బస్టాండ్ జలయమమైంది. బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఆర్టీసీ బస్టాండ్‌కు డ్రైనేజ్ సమస్య ఉన్నందున, వర్షం పడిన ప్రతిసారీ ఇలాగే జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది బస్టాండ్‌కు చేరుకుని వర్షపు నీటిని దారిమళ్లించారు.
పీలేరులో 84.2 మిల్లీమీటర్ల
వర్షపాతం నమోదు

జిల్లాలో వర్షం