పరిహారం.. పరిహాసం | - | Sakshi
Sakshi News home page

పరిహారం.. పరిహాసం

Sep 23 2025 7:35 AM | Updated on Sep 23 2025 7:35 AM

పరిహా

పరిహారం.. పరిహాసం

రాజంపేట/పెనగలూరు : సోమశిల జలాశయం బ్యాక్‌వాటర్‌ (వెనుక జలాల) ముంపు పరిహారం పరిహాసంలా మారింది. దశాబ్దాలుగా కొనసాగు తున్నా.. పూర్తి స్థాయిలో చెల్లించలేదు. దీంతో బాధి తులు గ్రామాలకు వదలలేక.. ఏటా ముంపునకు గురవుతున్నారు. ఇంకెన్నాళ్లు పడుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి వేదన అరణ్య రోదనగా మారింది. విధిలేని పరిస్థితుల్లో న్యాయస్థానంవైపు అడుగులు వేస్తున్నారు. పరిహారం విషయంలో అనేక విధాలుగా.. పలు మార్లు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికీ కేసులు కొనసాగుతున్నాయి. కొందరికి కోర్టు అనుకూల తీర్పులు ఇచ్చింది. మరికొన్ని కేసులు పెండింగ్‌లో న్నాయి.

ముంపు గ్రామాలు

నెల్లూరు జిల్లాలోని పెన్నా నదిపై సోమశిల జలాశయం నిర్మాణం 1979 నుంచి ప్రారంభమైంది. 1981లో రిజర్వాయర్‌ అందుబాటులోకి వచ్చింది. 1986కి పూర్తయింది. ఉమ్మడి వైఎస్సార్‌ కడప జిల్లాలో నందలూరు, ఒంటిమిట్ట, పెనగలూరు, గోపవరం, ఒంటిమిట్ట మండలాల్లో సోమశిల ముంపు గ్రామాలు ఉన్నాయి. 1979 నుంచి జలాశయం వెనుకజలాలతో మునకకు గురయ్యే గ్రామాలను గుర్తించి దశలవారీగా పరిహారం చెల్లిస్తూ వచ్చారు. సోమశిల వెనుకజలాల కింద 130 గ్రామాలు మునకకు గురవుతున్నాయి. రాజంపేటలో సోమశిల స్పెషల్‌ డిప్యూటీ కార్యాలయం కూడా ఏర్పాటు చేశారు. దాదాపు అన్ని గ్రామాలకు పరిహారం పంపిణీ చేసి ఖాళీ చేయించారు. అయితే అనేక కారణాలతో పరిహారం పంపిణీ పెండింగ్‌లో ఉండిపోయింది. జలాశయంలో పూర్తి స్థాయిలో (77.988 టీఎంసీ)నీటి నిల్వ ఉంచలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది. ప్రస్తుత నీటిమట్టం 99.857 మీటర్లలో ఉంది. ఇన్‌ఫ్లో 12649 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.

ప్రహసనంలా..

ఉమ్మడి కడప జిల్లాలోని నందలూరు, ఒంటమిట్ట, గోపవరం, అట్లూరు, పెనగలూరు మండలాల్లోని ముంపు గ్రామాలకు సకాలంలో పరిహారం పంపిణీ చేయలేకపోయారు. ప్రస్తుతం జలాశయంలో 72.25 టీఎంసీలు ఉండగా.. ముంపుగ్రామాలకు నీరు చేరింది. నందలూరు మండలం పొత్తపి, నూకినేనిపల్లె, పెనగలూరు మండలం సిరవరం, ఎస్‌ఆర్‌పురం గ్రామాల పరిధిలో 296 ఎకరాల్లో సాగుచేసిన పంటలు నీట మునిగాయి. అధికారులు కూడా గుర్తించారు. భూసేకరణ చేయాలనే ప్రతిపాదన అటకెక్కించారు. సోమశిల అధికారులు కన్సల్టెంట్‌ అవార్డు చేసి, ఒకేసారి పరిహారం చెల్లింపులు జరిపి ఉంటే ఇప్పుడు పరిహారం పంపిణీ విషయంలో ఎలాంటి సమస్యలు తలెత్తేవి కాదని ముంపు బాధితులు చెబుతున్నారు.

భూములకు పరిహారం.. గ్రామానికి ఏదీ?

ఒంటిమిట్ట మండలం పెన్నపేరూరు గ్రామానికి పరిహారం ఇవ్వలేదు. వారికి జీవనాధారమైన పంట పొలాల్లో వెనుకజలాలు తిష్ట వేసి ఉన్నాయి. పరిహారం ఇచ్చేస్తే ఖాళీ చేసి వెళ్లిపోతామని ముంపు బాధితులు కోరుతున్నప్పటికీ.. ప్రభుత్వం వారి మాట పెడచెవిన పెడుతోంది. ఇదే పరిస్థితి నందలూరు మండలంలోని పొత్తపి గ్రామంలో కూడా నెలకొని ఉంది. ఈ విధంగా ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లాలోని ముంపు గ్రామాల్లో రైతులు తమ భూములకు పరిహారం రాక.. మరికొందరు గ్రామాలకు అందక ఇబ్బంది పడుతున్నారు.

పూర్తి సామర్థ్యంలో నీళ్లు పెడితే..

సోమశిల జలాశయంలో 77.988 టీఎంసీల నీటి నిల్వ పెడితే ఉమ్మడి కడప జిల్లాలోని ముంపుగ్రామాలతోపాటు సమీప పొలాలు మునిగిపోతాయి. గతంలో అనేక మార్లు ఇలాంటి పరిస్ధితులు ఏర్పడ్డాయి. జలాశయం పూర్తిసామర్థ్యం వరకు రాకుండా, ముంపుగ్రామాలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకొని నీటి విడుదల విషయంలో అడుగులు వేస్తున్నారు.

నాలుగున్నర దశాబ్దాలుగా..

నాలుగున్నర దశాబ్దాలుగా ముంపుగ్రామాలకు పరిహారం పంపిణీ కొనసాగుతూనే ఉంది. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో ముంపు బాధితులకు న్యాయంగా పరిహారం అందజేసేందుకు కడపలో లోక్‌ అదాలత్‌ ద్వారా ఒకేసారి సెటిల్‌మెంట్‌ చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో రూ.330 కోట్లకు పైగా పరిహారాన్ని బాధితులకు అందజేసేందుకు చర్యలు తీసుకున్నారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని సోమశిల ముంపు బాధితులు గుర్తు చేసుకుంటున్నారు.

సోమశిల బ్యాక్‌ వాటర్‌

గ్రామాలకు పూర్తి కాని పంపిణీ

నాలుగున్నర దశాబ్దాలుగా

కొనసాగుతున్న వైనం

ఏటా ముంపునకు గురవుతున్న పొలాలు

అష్టకష్టాలు పడుతున్న బాధితులు

పరిహారం.. పరిహాసం1
1/2

పరిహారం.. పరిహాసం

పరిహారం.. పరిహాసం2
2/2

పరిహారం.. పరిహాసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement