
చెట్లు నరికి అక్రమంగా తరలింపు
గుర్రంకొండ : మండలంలోని చెర్లోపల్లె పంచాయతీ దద్దాలవారిపల్లె గ్రామానికి సమీపంలోని శ్రీ రెడ్డెమ్మకొండ పరిసరాల్లో ఉన్న కొండలు, గుట్టలతో పాటు పొలాల్లో పెద్ద ఎత్తున కలపచెట్లు ఉన్నాయి. వీటిపై అక్రమార్కుల కన్నుపడింది. కన్నుపడిందే తడవుగా చెట్లను అక్రమంగా నరికివేసి ట్రాక్టర్ల ద్వారా బయట మండలాలకు తరలించుకుపోతున్నారు. గత పదిహేను రోజులు ఈ తంతు సాగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కొంతమంది బయట మండలాలకు చెందిన వ్యాపారులు ఇక్కడే మకాం వేసి ఇష్టానుసారం కలపచెట్లను నరికి అక్కడే కుప్పలుగా వేస్తున్నారు. కట్టెలు ఎక్కువగా సేకరించి ట్రాక్టర్ల ద్వారా బయట మండలాలకు తరలిస్తున్నారు. ఎంతో విలువైన వృక్షసంపదను నాశనం చేస్తున్నా అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ఉన్నాతాఽధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.