
యూరియా వాడకం తగ్గించాలి
చిన్నమండెం : రైతులు యూరియా వాడకాన్ని తగ్గించి నానో ఎరువులు, జీవన ఎరువులు వాడాలని జిల్లా వ్యవసాయాధికారి శివనారాయణ సూచించారు. సోమవారం చిన్నమండెంలో వ్యవసాయ శాఖ, ఇఫ్కో సహకార సంస్థ వారి ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ సమావేశం, మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం యూరియా వాడకం వల్ల పర్యావరణంపై కలిగే నష్టాలను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారిణి గీత, వ్యవసాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రైల్వేకోడూరు అర్బన్ : గుంజనేరు రక్షణ గోడ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు తెలిపారు. సోమవారం ఆయన వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి రక్షణ గోడ నిర్మాణ పనులను పరిశీలించి, గుత్తేదారుతో మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో వర్షాలు అధికంగా కురుస్తున్నాయన్నారు. గుంజనేరు నది పరీవాహక ప్రాంతాల్లో వర్షం కురిస్తే యేరు ఉధృతంగా ప్రవాహిస్తుందని, దీంతో కోడూరు పట్టణం, సరసరాం పేట తదితర ప్రాంత ప్రజలు ముంపునకు గురి కాకూడదు అనే దృష్టితో గత ప్రభుత్వంలో రక్షణగోడను మంజూరు చేయించామన్నారు. అలానే వందల కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరిపామన్నారు. కూటమి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం చేయకుండా చిత్తశుద్ధితో వ్యవహరించి పనులు పూర్తి చేయాలని తెలియజేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి, సీహెచ్ రమేష్, శివయ్య, ఎంపీటీసీ మహేష్, దుర్గయ్య, వెంకటరెడ్డి, రమణ, రాజగోపాల్, కృష్ణారెడ్డి, వినోద్, రఘు, మణి తదితర నాయకులు పాల్గొన్నారు.
పెనగలూరు : మండలంలోని ఎన్‌ఆర్ పురం పంచాయతీ పల్లంపాడు గ్రామానికి చెయ్యేరు నదిపై రోడ్డు వేస్తామని జెడ్పీటీసీ సుబ్బరాయుడు అన్నారు. సోమవారం జెడ్పీటీసీ సుబ్బరాయుడు, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ కేతా చక్రపాణిలు చెయ్యేరు నదిపై తెగిపోయిన రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ మాజీ చైర్మన్ కొండూరు అజయ్‌రెడ్డి, మండల వైస్ ప్రెసిడెంట్ విజయరెడ్డిల ఆదేశాల మేరకు ఈ రోడ్డును పరిశీలించడం జరిగిందన్నారు. జెడ్పీ నిధులు ద్వారా ఈ రోడ్డును వేసేందుకు కృషి చేస్తామని తెలియజేశారు. చెయ్యేరు నదిపై రోడ్డు వేసేటప్పుడు సిమెంటు బొంగులు ఏర్పాటు చేసి రోడ్డు వేస్తామని చెప్పారు. రోడ్డు నిర్మాణం విషయమై అజయ్‌రెడ్డి, విజయ్‌రెడ్డిలతో చర్చించినట్లు జెడ్పీటీసీ తెలియజేశారు.

యూరియా వాడకం తగ్గించాలి