
అక్రమ ప్రమోషన్లపై ప్రభుత్వానికి నివేదిక
మదనపల్లె: హంద్రీ–నీవా ప్రాజెక్టు రెండోదశ మదనపల్లె సర్కిల్–3 పరిధిలో జరిగిన అక్రమ పదోన్నతుల వ్యవహరం కొలిక్కి వచ్చింది. హంద్రీ–నీవాలో ‘అక్రమ ప్రమోషన్’ శీర్షికన అగస్టు 7న సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీనిపై సమగ్ర వివరాలతో నివేదిక పంపాలని ఈఎన్‌సీ నుంచి మెమోలు జారీ అయ్యాయియి. ఈ విషయంలో ఎస్‌ఈ విఠల్‌ప్రసాద్ వివరాలతో నివేదికను పంపడం ఆలస్యంగా తెలిసింది. ఏపీఈఎస్‌ఎస్ నిబంధనల షెడ్యూల్ ప్రకారం టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగ నియామకానికి అవసరమైన అర్హత కోసం ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ నిర్వహించే ట్రేడ్ టెస్ట్ (డ్రాఫ్ట్‌స్ మ్యాన్) సివిల్ లేదా మెకానికల్ కోర్సులో ఉత్తీర్ణత సాధించాలి. నియామకాలు, బదిలీలు, పదోన్నతులను పరిగణలోకి తీసుకునేటప్పుడు సర్వీసు నియామకాల జీవో, సూచనలను కచ్చితంగా పాటించాలి. అయితే హంద్రీ–నీవా ప్రాజెక్టులో పని చేస్తున్న ఉద్యోగుల విషయంలో పాటించలేదని తేలింది. మదనపల్లె ఎస్‌ఈ కార్యాలయంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగికి మూడు ప్రమోషన్లను నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చారని నిర్ధారించారు. ఎస్‌ఈ చిట్టిబాబు టెక్నికల్ అసిస్టెంట్‌గా ఉద్యోగ నియామకం చేయగా ఎస్‌ఈ పి.కృష్ణ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్‌గా, ఎస్‌ఈ బీవీ.సుబ్బారావు అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్‌గా, ఎస్‌ఈ సీఆర్.రాజగోపాల్ టెక్నికల్ ఆఫీసర్‌గా ఉద్యోగోన్నతి కల్పించారని, ఆ సమయంలో పనిచేసిన డీఎస్‌ఈ, సూపరింటెండెంట్ వివరాలను పేర్కొన్నారు. అలాగే కుప్పం డివిజన్‌లో పని చేస్తున్న బ్లూ ప్రింటర్ ఆపరేటర్లు వై.చెన్నయ్య, కె.అబ్బిరెడ్డెయ్య, కదిరి డివిజన్‌లో పని చేస్తున్న పి.ఖాదర్‌బాషాలకు అర్హతలేకున్నా టెక్నికల్ అిసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించారు. ఈ పదోన్నతులను ఎస్‌ఈ బీవీ.సుబ్బారావు ఇచ్చారని పేర్కొన్నారు. అయితే ఈ నివేదికపై ప్రభుత్వం తీసుకున్న చర్యల వివరాలు వెలుగులోకి రాలేదు. నివేదికతో ఉద్యోగుల్లో కలవరం నెలకొంది.