
ఫైనాన్షియర్ దారుణ హత్య
● ఇంటి పక్కనే హతమార్చి కుందూ నదిలో పడేసిన దుండగులు
● రెండు రోజులు గాలించి మృత దేహాన్ని గుర్తించిన పోలీసులు
ప్రొద్దుటూరు క్రైం : అవసరానికి అప్పులివ్వడమే ఆయన చేసిన నేరమా. తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించమని అడిగిన పాపానికి రుణదాతనే దుండగులు హతమార్చారు. ప్రొద్దుటూరుకు చెందిన ఫైనాన్షియర్ కొండా వేణుగోపాల్ రెడ్డి (54) శనివారం దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు దారుణంగా హతమార్చి చాపాడు సమీపంలోని కుందూ నదిలో పడేశారు. బాధితులు, పోలీసుల వివరాల మేరకు.. కుటుంబ సభ్యులు ఊహించినట్టే ప్రముఖ వడ్డీ వ్యాపారి వేణుగోపాల్‌రెడ్డి బాకీ దారుల చేతిలోనే హత్యకు గురయ్యాడు. పోరుమామిళ్ల మండలం రెడ్డికోట గ్రామానికి చెందిన వేణుగోపాల్‌రెడ్డి కొన్నేళ్ల క్రితం ప్రొద్దుటూరుకు వచ్చి స్ధిరపడ్డారు. కొన్నేళ్ల వరకూ వైఎంఆర్ కాలనీలో నివాసం ఉండే వారు. జమ్మలమడుగు రోడ్డులోని మున్సిపల్ ప్లాట్‌లలో విశాలమైన భవంతి నిర్మించుకొని నాలుగేళ్లుగా అక్కడే ఉంటున్నారు. వేణుగోపాల్‌రెడ్డికి భార్య ప్రమీలాదేవి, కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి, కుమార్తె స్వప్న ఉన్నారు. కుమారుడు అమెరికాలో ఎంఎస్ చేస్తున్నాడు. కుమార్తె బీటెక్ పూర్తి చేసి ఇంట్లో ఉంటోంది. వేణుగోపాల్‌రెడ్డి తెలిసిన వారికి వడ్డీకి డబ్బులు ఇస్తూ గడువు ముగిసిన తర్వాత తిరిగి తీసుకునేవాడు. ఇలా పట్టణంలో పెద్ద మొత్తంలో అప్పులిచ్చినట్లు
తెలుస్తోంది.
ఇంటి సమీపంలోనే కాపు కాచి..
వేణుగోపాల్‌రెడ్డి ఇల్లు జమ్మలమడుగు రోడ్డు పక్కన బొల్లవరం ప్లాట్‌లో ఉంది. ప్రధాన రహదారికి అతి సమీపంలో ఆయన ఇల్లుంది. శుక్రవారం సాయంత్రం 6.30 సమయంలో ఇంటి నుంచి స్కూటీలో అతను బయటికి వెళ్లాడు. రోజూ రాత్రి 8–15, 8–30 గంటల్లోగా ఇంటికి వచ్చేవాడు. అయితే శుక్రవారం రాత్రి 8.50 దాటినా వేణుగోపాల్‌రెడ్డి ఇంటికి రాకపోవడంతో కుమార్తె స్వప్న ఫోన్ చేసింది. అతని ఫోన్ నంబర్లు పని చేయలేదు. రోడ్డుపై ఉన్నాడేమో చూసి రమ్మని వాచ్‌మెన్‌ను పంపించారు. అతను బయటికి వెళ్లగానే ఇంటి సమీపంలో వేణుగోపాల్‌రెడ్డి స్కూటీ పడిపోయి ఉంది. పక్కనే అతని చెప్పులతోపాటు కారం పొడి ఉండడంతో ఫైనాన్షియర్ కిడ్నాప్‌నకు గురయ్యాడని కుటుంబ సభ్యులు భావించారు. ఇదిలా ఉండగా రాత్రి 8 గంటల తర్వాత వేణుగోపాల్‌రెడ్డి ఇంటికి వస్తాడని భావించిన దుండగులు ప్రధాన రహదారిలోని ఆర్చీ వద్ద కాపు కాసినట్లు తెలుస్తోంది. స్కూటీలో ఇంటికి వెళ్తున్న సమయంలో ఆర్చీ దాటగానే దుండగులు అడ్డగించి, కళ్లలో కారం పొడి చల్లి ఘటనా స్థలంలోనే హత్య చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కిడ్నాప్ చేసి అతన్ని ఎత్తుకెళ్లాలని ముందుగా వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది. వేణుగోపాల్‌రెడ్డి ఘటనా స్థలంలోనే మృత్యువాతపడడంతో మృతదేహాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లి కుందూలో పడేసినట్లు సమాచారం.
కుటుంబసభ్యుల అనుమానమే నిజమైంది..
బాకీ తీసుకున్న వారు గడువు ముగిసినా డబ్బు చెల్లించకపోవడంతో కొందరిపై వేణుగోపాల్‌రెడ్డి కోర్టులో కేసు వేసినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. కేసు తుది విచారణకు వచ్చినట్లు వేణుగోపాల్‌రెడ్డి భార్య ప్రమీలాదేవి మీడియాతో వెల్లడించారు. కేసు తమకు అనుకూలంగా వస్తుందని భావించిన బాకీ దారులు తన భర్తను కిడ్నాప్ చేసి హాని తలపెట్టాలని చూస్తున్నారని ఆమె అనుమానం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే చివరకు ప్రమీలాదేవి అనుమానమే నిజమైంది. బాకీ దారుల్లో కొందరు ఆమె భర్తను హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. వీరిలో వేణుగోపాల్‌రెడ్డి బంధువు కూడా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
కుందూలో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు
వడ్డీ వ్యాపారి వేణుగోపాల్‌రెడ్డి కిడ్నాప్‌నకు గురయ్యాడని తెలిసిన వెంటనే ప్రొద్దుటూరు రూరల్ ఎస్‌ఐ అరుణ్‌రెడ్డి ఆధ్వర్యంలో రాజుపాలెం ఎస్‌ఐ వెంకటరమణ, రూరల్ ఎస్‌ఐ రాజుతో కలిసి నాలుగు టీంలుగా ఏర్పడి రాత్రింబవళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. కారులో ఫైనాన్షియర్‌ను తీసుకెళ్లినట్లు సీసీ పుటేజీ ద్వారా గుర్తించారు. ఇలా కారు వెళ్లిన ప్రాంతాల్లో విస్తృతంగా గాలించారు. ఈ క్రమంలో చాపాడు సమీపంలోని కుందు బ్రిడ్జి వద్ద నదిలో ఆదివారం వేణుగోపాల్‌రెడ్డి మృతదేహాన్ని గుర్తించారు. ప్రొద్దుటూరు అగ్నిమాపక రెస్క్యూ టీంతో కలిసి అరుణ్‌రెడ్డి నదిలోని మృతదేహాన్ని వెలికి తీశారు. కుందూ నదిలో నీరు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో మృతదేహాన్ని వెలికి తీయడం అతి కష్టంగా మారింది. ఎట్టకేలకు శ్రమించి మృతదేహాన్ని బయటికి తీశారు. అతని మృతదేహాన్ని చూపి భార్య ప్రమీలాదేవి, కుమార్తె స్వప్న బోరునా విలపించసాగారు. కేసులో అనుమానం ఉన్న కొందరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హత్యకు గల కారణాలను తమదైన పద్దతిలో వారి నుంచి రాబట్టే పనిలో పోలీసు అధికారులు నిమగ్నమైనట్లు తెలుస్తోంది.

ఫైనాన్షియర్ దారుణ హత్య

ఫైనాన్షియర్ దారుణ హత్య

ఫైనాన్షియర్ దారుణ హత్య