
ఒంటిమిట్ట రామయ్యకు పూజలు
ఒంటిమిట్ట : ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట కోదండ రామాలయం, నందలూరు సౌమ్యనాథ స్వామి ఆలయాల్లో రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్ శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి దర్శనానికి వచ్చిన ఆయనకు రెండు చోట్ల ఆలయ మర్యాదలతో స్వాగతం లభించింది. ముందుగా రామయ్య మూల విరాట్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సౌమ్య నాథుడి సన్నిధిలో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సోమ, రామకృష్ణ, రామాంజనేయరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
రోడ్డుపై కూలిన నీలగిరి చెట్టు
మదనపల్లె రూరల్ : మండలంలోని సీటీఎం సమీపాన కంకరమిషన్ వద్ద ప్రధాన రహదారిపై రోడ్డుకు అడ్డంగా నీలగిరి చెట్టు కూలింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు భూమి బాగా తడిచి ఉండడంతో బలంగా వీస్తున్న ఈదురుగాలులకు చెట్టు నేలకొరిగింది. సమయానికి రోడ్డుపై వాహన, జనసంచారం లేకపోవడంతో ప్రమాదం తప్పింది. స్థానికులు విషయాన్ని పంచాయతీ అధికారులకు తెలుపడంతో వారు ఘటనాస్థలానికి చేరుకుని జేసీబీ సాయంతో చెట్టును తొలగించారు.
తెలుగు తమ్ముళ్లపై కేసులు నమోదు..
రాయచోటి : ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న తెలుగు తమ్ముళ్లపై రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. శనివారం సాయంత్రం పట్టణంలోని మదనపల్లె మార్గంలో టీడీపీకి చెందిన రెండు వర్గాలు ఒకరిపై మరో దాడులు చేసుకునే విషయం తెలిసిందే. ఈ సంఘటనలో తెలుగు యువత అధ్యక్షుడు జాబీర్, మరో తెలుగు మైనార్టీ నాయకుడు సయ్యద్‌లకు రక్త గాయాలయ్యాయి. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లీ సీరియస్ కావడంతో రాయచోటి అర్బన్ పోలీసులు ఇరువురిపై ఆదివారం కేసులు నమోదు చేశారు.
అక్రమంగా కలప తరలింపు
మదనపల్లె రూరల్ : అక్రమంగా కలప తరలిస్తున్న ట్రాక్టర్‌ను అదుపులోకి తీసుకుని అటవీ అధికారులు జరిమానా విధించారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న చెట్లు కొందరు తొలగించి ముక్కలుగా చేసి ట్రాక్టర్‌లో తరలించేందుకు ప్రయత్నించారు. ఇన్‌చార్జ్ డీఆర్వో శివకుమార్ జిల్లా ఆస్పత్రికి చేరుకుని, అనుమతులు లేకుండా కలప తరలిస్తున్న మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి శంకర్‌రెడ్డిని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే అనుమతితో తరలిస్తున్నామని, కావాలంటే ఫోన్ చేయిస్తానని చెప్పాడు. దీంతో అటవీ అధికారులు ఎమ్మెల్యే షాజహాన్‌బాషాకు ఫోన్ చేశారు. ఆయన స్పందిస్తూ తాను ఎవరికీ అనుమతులు ఇవ్వలేదని, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పారు. దీంతో ట్రాక్టర్‌ను సీజ్ చేసి అటవీ కార్యాలయానికి తరలించారు. ఎఫ్‌ఆర్వో జయప్రసాదరావు విచారించి రూ.8,500 జరిమానా విధించారు.

ఒంటిమిట్ట రామయ్యకు పూజలు

ఒంటిమిట్ట రామయ్యకు పూజలు