
పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం
● మహిళను కాపాడిన పోలీసులు
● సిబ్బందిని అభినందించిన ఎస్పీ
కడప కోటిరెడ్డిర్కిల్ : కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న మహిళను బ్లూ కోల్ట్ పోలీసులు రక్షించారు. జిల్లా ఎస్పీచే అభినందనలు అందుకున్నారు. పోలీసుల వివరాల మేరకు.. కుటుంబ కలహాలతో కడప ఎర్రముక్కపల్లి సమీపంలో ఉంటున్న ఓ మహిళ, ఇద్దరు పిల్లలను తీసుకుని ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో భాకరాపేట రైల్వే గేట్ వద్ద ట్రాక్‌పై నడచి వెళ్తోంది. విధుల్లో ఉన్న ట్రాక్‌మెన్ కిశోర్ గుర్తించి 112కు సమాచారం చేరవేశారు. గస్తీలో ఉన్న బ్లూకోల్ట్ సిబ్బంది, కానిస్టేబుళ్లు రమాకాంత్‌రెడ్డి, శ్రీనివాసులు రంగంలోకి దిగి రైలు కింద పడి తనువు చాలించాలనుకున్న మహిళ, ఇద్దరు పిల్లలను సురక్షితంగా తీసుకువచ్చారు. కుటుంబసభ్యులకు అప్పగించి స్థానికుల మన్ననలు పొందారు. నిమిషం ఆలస్యమైనా స్టేషన్ నుంచి బయలుదేరిన రైలు క్రిందపడి ముగ్గురు విగత జీవులుగా మిగిలేవారు. మహిళకు కౌన్సిలింగ్ నిర్వహించి బంధువులకు అప్పగించారు. సురక్షితంగా కాపాడిన సిబ్బందిని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బలవన్మరణానికి పాల్పడడం అత్యంత భయంకరమైన నిర్ణయమని, ఉద్వేగంతో క్షణాల్లో ఇక జీవించలేనంటూ స్వస్తి పలకడం పొరపాటు నిర్ణయమని వివరించారు. సమస్యలతో సతమతమవుతున్న వారు ఎందరో కాలంతో పోరాడి ఎలా బ్రతుకుతున్నారో చూసి, ఆత్మస్థైర్యంతో జీవించాలని ఎస్పీ సూచించారు.