
పనుల్లో నాణ్యత డొల్ల
జమ్మలమడుగు : జాతీయ రహదారి నిర్మాణంలో డొల్లతనం బయటపడుతోంది. నంద్యాల–జమ్మలమడుగు 167 నెంబర్ జాతీయ రహదారి పనులు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. అప్పడప్పుడూ చుట్టపు చూపుగా వచ్చే అధికారులు నామామాత్రంగా తనిఖీలు చేసి పోతున్నారనే విమర్శలున్నాయి. కీలకంగా ఎస్‌ఆర్‌సీ కన్‌స్ట్రక్షన్ ఇంజినీర్లు పనులు చేస్తున్నారేగానీ నేషనల్ హైవే అధికారుల పర్యవేక్షణ లేదని తెలుస్తోంది. జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా పెన్నానదిపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం చేయాల్సి ఉంది. ప్రస్తుతం పిల్లర్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇక్కడే నాణ్యతలో డొల్లతనం బయటపడుతోంది. కనీసం 16 ఎంఎం కడ్డీలను ఉపయోగించితేనే పిల్లర్లు పటిష్టంగా ఉంటాయి. కానీ కంపెనీ 10 ఎంఎం, 8 ఎంఎం, 6 ఎంఎం కడ్డీలు రెండు, మూడు కడ్డీలు 16ఎంఎం ఉపయోగించడం జరుగుతోంది. దీంతో ఈ పిల్లర్లు ఎంత వరకు నిలబడుతాయోనని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
డిజైన్ ప్రకారమే పిల్లర్ల నిర్మాణం
పెన్నానదిపై హై లెవల్ వంతెన నిర్మాణం జరుగుతోంది. డిజైన్ ప్రకారమే జరుగుతున్నాయి. ఒక్కొక్క పిల్లర్ ఒక్కో రకంగా ఉంటాయి.
– సురేందర్‌రెడ్డి, ఏఈ, జమ్మలమడుగు