
కళ్లల్లో కారం చల్లి.. ఫైనాన్షియర్ కిడ్నాప్
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులో ప్రముఖ ఫైనాన్షియర్ వేణుగోపాల్‌రెడ్డిని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. శుక్రవారం రాత్రి స్కూటీలో ఇంటికి వస్తుండగా దారి మధ్యలో కాపు కాచిన దుండగులు కళ్లలో కారంపొడి చల్లి కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బొల్లవరం ప్రాంతానికి చెందిన వేణుగోపాల్‌రెడ్డి కొన్నేళ్ల క్రితం జమ్మలమడుగు రోడ్డులోని బొల్లవరం మున్సిపల్ ప్లాట్‌లలో విశాలమైన భవంతి నిర్మించుకొని అక్కడే ఉంటున్నారు. ఆయన వడ్డీకి అప్పులిస్తుంటాడు. శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలు కావస్తున్నా ఇంటికి రాకపోవడంతో కుమార్తె స్వప్న వేణుగోపాల్‌రెడ్డికి ఫోన్ చేయగా స్విచ్చాఫ్‌లో ఉంది. మరో నంబర్ అందుబాటులో లేదు. కొద్ది సేపటి తర్వాత వాచ్‌మెన్ బయటికి వెళ్లి చూడగా జమ్మలమడుగు రహదారిలోని ఆర్చి వద్ద వేణుగోపాల్‌రెడ్డి స్కూటీ కిందపడిపోయి ఉంది. వాచ్‌మెన్ కేకలు వేయడంతో ప్రమీలాదేవి, కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చారు. స్కూటీ పక్కనే వేణుగోపాల్‌రెడ్డి చెప్పులతోపాటు కారంపొడి పడి ఉండటంతో ఎవరో ఆయనను కిడ్నాప్ చేశారని భావించిన కుటుంబ సభ్యులు బోరున విలపించసాగారు. రూరల్ ఎస్‌ఐ అరుణ్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి రాత్రంతా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ పుటేజీ ఆధారంగా కొందరు వ్యక్తులు కారులో వేణగోపాల్‌రెడ్డిని ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ప్రమీలాదేవి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రత్యే క బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పా రు. తమకు డబ్బు ఇవ్వాల్సిన వాళ్లే తన భర్త వేణుగోపాల్‌రెడ్డిని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లి ఉంటారని ప్రమీలాదేవి తెలిపారు. తమకు బాకీ ఉన్నవాళ్లు తన భర్త కు హాని తలపెట్టేలా ఉన్నారని ఆమె రోదించింది.

కళ్లల్లో కారం చల్లి.. ఫైనాన్షియర్ కిడ్నాప్