
ముంచెత్తిన వాన
నిలిచిపోయిన రాకపోకలు
రాయచోటి: అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా మూడురోజులుగా వర్షాలు దంచి కొడుతున్నాయి. గురువారం అర్ధరాత్రి అనంతరం ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. రాయచోటిలోని ఎన్‌జీఓ కాలనీలో నివాసం ఉంటున్న మధుసూదన్ రెడ్డి ఇంటిపై పిడుగు పడింది. దీంతో గోడలు దెబ్బతిన్నాయి ఇంటిలోపలకు పిడుగుచొచ్చుకొని వె ళ్లింది. అయితే ఎవరికీ గాయాలు కాలేదు. వర్షాలకు తంబళ్లపల్లి నియోజకవర్గంలోని ములకల చెరువు, పెద్దతిప్ప సముద్రం, కొత్తకోట, పెద్దమండెం మండలాల్లోని చెరువులన్నీ నిండాయి. సుండుపల్లిలోని పింఛా ప్రాజెక్టులనుండి నదుల్లోకి ప్రవాహం సాగుతోంది.
తెగిన చెరువుకట్ట...దెబ్బతిన్న రహదారి.....
గురువారం రాత్రి కురిసిన వర్షానికి సుండుపల్లి మండల పరిధిలోని అయ్యవారి చెరువు కట్ట తెగిపోవడంతో సమీపంలోని వాగులు, వంకలు, నదులు ఉధృతంగా ప్రవహించాయి. రాయచోటి– పింఛా మార్గంలోని బహుదా నదిపై నిర్మించిన రహదారి తెగిపోయింది. దీంతో ఆయా గ్రామాలకు మండల కేంద్రమైన సుండుపల్లితో రవాణా ఆగిపోయింది. శుక్రవారం ఉదయానికి జిల్లాలోని ములకల చెరువులో 256 మిల్లీ మీటర్ల మేర అత్యధిక వర్షపాతం నమోదైంది. పెద్ద తిప్ప సముద్రంలో 163.6, బి కొత్తకోటలో 75.4, పెద్దమండెంలో 69.6, గాలివీడు 60.8, పెనగలూరు 58.6, వీరబల్లి 55.4, తంబళ్లపల్లి 49.2, సుండుపల్లి 46.2, రాయచోటి 406., రామాపురం 40.2, వాల్మీకిపురం 32.6, రామసముద్రం 29, మదనపల్లి 28.2, కురబలకోట 28, కలికరి 25, చ్ని మండెం 20., కలకడ 18.8, నిమ్మనపల్లి 15.4, సంబేపల్లి 13.4, నందలూరు 10.4, కెవిపల్లి 12.2 మిల్లీమీటర్ల వంతున వర్షపాతం నమోదైంది. పుల్లంపేట, ఓబులవారిపల్లి, కోడూరు మండలాల్లో చుక్క వర్షపాతం నమోదు కాలేదు. జి ల్లాలో శుక్రవారం రాత్రి 7 గంటల నుంచి భారీ వర్షం కురుస్తోంది. రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తుండటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.
పెనగలూరు: మండలంలో చెయ్యేరు నది నీరు ప్రవహించడంతో పల్లంపాడు గ్రామానికి గురువారం రాత్రి నుంచి రాకపోకలు నిలిచిపోయాయి.
సుండుపల్లె: మండలంలోని చెరుకువాండ్లపల్లి లోని అయ్యవారి చెరువు కట్ట తెగిపోవడంతో నీరు రోడ్డు మీదకు చేరింది. దీంతో రాయచోటి– పింఛా ప్ర ధాన రహదారి దెబ్బతిని రాకపోకలు నిలిచిపోయాయి.
పెద్దమండ్యం: వర్షానికి పెద్దమండ్యంలో కుషావతీ నది ప్రవాహంతో శుక్రవారం వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.మదనపల్లె– గాలివీడు మార్గంలో తిరిగే ఆర్‌టీసీ బస్సులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. ఉదయం పాఠశాల, ప్రభుత్వ కార్యాలయాల వేళలో నది ప్రవాహంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.
ములకలచెరువులో 256 మి.మీ వర్షం
పొంగుతున్న వాగులు
రాయచోటిలో ఇంటిపై పడిన పిడుగు.. తప్పిన ప్రాణ నష్టం

ముంచెత్తిన వాన

ముంచెత్తిన వాన