
నేడు జాబ్ మేళా
మదనపల్లె సిటీ: స్థానిక నిమ్మనపల్లె రోడ్డులోని జీఎంఆర్ పాలిటెక్నిక్ కాలేజీలో శనివారం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి దాసరి నాగార్జున తెలిపారు. జాబ్‌మేళాకు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరుకానున్ననట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 9553202509, 6301612761 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు.
రాజంపేట: రాజంపేట మండలం ఆకేపాడులోని ఆకేపాటి ఎస్టేట్‌లో జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి అధ్యక్షతన వైఎస్సార్‌సీపీ జిల్లా ఎస్సీ విభాగం విస్తృత స్థాయి సమావేశం శనివారం మధ్యాహ్నాం 3 గంటలకు జరుగనుంది. ఈ విషయాన్ని విభాగం జిల్లా అధ్యక్షుడు రంగాల కమలాకర్ శుక్రవారం ఇక్కడ విలేకరులకు తెలిపారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎస్సీ జిల్లా ప్రతినిధులు పాల్గొంటారన్నారు. సమావేశానికి ఎస్సీసెల్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పీజే సుధాకర్‌బాబు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారన్నారు. ఎస్సీసెల్ విభాగంలో వివిధ హోదాలలో ఉన్న ఎస్సీసెల్ నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
రాయచోటి: జిల్లా అభివృద్ధి విషయంలో పరస్పర సహకారంతో ముందుకు సాగుతామని నూతనంగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్, ఎస్పీలు అభిప్రాయపడ్డారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి సమావేశమయ్యారు. జిల్లా అభివృద్ధి, చట్టవ్యవస్థ బలోపేతం, ప్రజాసేవలో పరస్పర సహకారంపై చర్చ, జిల్లా పోలీసు, రెవెన్యూ విభాగాల మధ్య సమన్వయం పెంపొందించుకోవాలన్న ఆత్మీయత, ప్రజల శ్రేయస్సుకోసం కలిసి కృషి చేయాలన్న సంకల్పం తదితర విషయాలపై చర్చించుకున్నట్లు తెలిపారు. ఈ మర్యాదపూర్వక భేటీతో జిల్లా పరిపాలనలో నూతనోత్సహం, సమన్వయం మరింత బలపడుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
కడప ఎడ్యుకేషన్: న్యూఢిల్లీలో ఇటీవల ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీ20 శిఖరాగ్ర సభకు కడప గాంధీనగర్ మున్సిపల్ హైస్కూల్‌కు చెందిన గణిత ఉపాధ్యాయుడు సురేష్ వెళ్లి పాల్గొన్నారు. న్యూఢిల్లీ భారత మండపంలో ఈ నెల 15 నుంచి 19 వరకు జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశంలో సుమారు 100 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. 59వ ఇంటర్నేషనల్ ఎలక్ట్రో టెక్నికల్ కమిషన్ (ఐఈసీ) జనరల్ మీటింగ్, ఎక్స్‌పోలో పాల్గొనుటకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అకడమిక్ డెలిగేట్‌గా కడప గాంధీనగర్ మున్సిపల్ హైస్కూల్ గణిత ఉపాధ్యాయుడు బి.సురేష్‌కు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎ) ఏపీ విజయవాడ బ్రాంచ్ నుంచి ఆహ్వానం అందింది. ఈ మేరకు ఆయన ఐఈసీ– 2025 జనరల్ మీటింగ్‌కు వెళ్లి పాల్గొన్నారు.
రాయచోటి: విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసే నూతన ఆవిష్కరణల పోటీలకు సంబంధించి ఇన్‌స్పైర్ మనాక్ నామినేషన్‌లను శనివారం సాయంత్రంలోపు సమర్పించాలని జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రమణ్యం ప్రధానోపాధ్యాయులు, సైన్స్ ఉపాధ్యాయలకు సూచించారు. రాయచోటిలోని డైట్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇన్‌స్పైర్ హెల్ప్ డెస్కును శుక్రవారం మధ్యాహ్నం సందర్శించారు. దసరా సెలవులు వస్తున్నందున జిల్లాలోని అన్ని పెండింగ్ పాఠశాలలు శనివారం సాయంత్రంలోపు విద్యార్థులతో ఆన్‌లైన్‌లో నామినేషన్లు సమర్పించాలని డీఈఓ తెలియజేశారు. అలా చేయని వారు సెలవు రోజుల్లో జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో నామినేషన్లు సమర్పించాలన్నారు. ఆరు నుంచి పన్నెండు తరగతులు చదువుతున్న విద్యార్థుల్లో దాగి ఉన్న అన్వేషణాత్మక ఆలోచనలను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. డైట్ ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ మడితాటి నరసింహారెడ్డి, జిల్లా సైన్స్ అధికారి మార్ల ఓబుల్ రెడ్డి, సైన్స్ రిసోర్స్ పర్సన్ రంజిత్ నాయక్ పాల్గొన్నారు.

నేడు జాబ్ మేళా