
పేకాట స్థావరంపై పోలీసుల దాడులు
మదనపల్లె రూరల్ : డ్రోన్ సాంకేతికతను ఉపయోగించి నిమ్మనపల్లె మండలం బోయకొండ సమీపంలోని మామిడి తోటలో పేకాడుతున్నారనే సమాచారంతో పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. ఆరుగురు జూదరులను అరెస్టు చేసి వారి నుంచి రూ.55 వేల నగదు 16 ద్విచక్ర వాహనాలు, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ కే.మహేంద్ర తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ నిమ్మనపల్లె మండల సరిహద్దులో పెద్ద ఎత్తున పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో డ్రోన్ సాయంతో జూద స్థావరాన్ని గుర్తించామన్నారు. ఎస్‌ఐలు రహీముల్లా, అన్సర్ బాషాల బృందం దాడులు నిర్వహించి మదనపల్లెకు చెందిన ఈ.శ్రీనివాసులు, వి.శ్రీరాములు, కలికిరికి చెందిన వెంకటరమణ, పుంగనూరుకు చెందిన అక్కులప్ప, రెడ్డెప్పనాయక్, హరిలను అరెస్ట్ చేశారన్నారు. నిందితులపై కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించామన్నారు. ఎవరైనా పేకాట ఆడినా, నిర్వహించినా సాంకేతికత సాయంతో గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ములకలచెరువు సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐలు అన్సర్‌బాషా, తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు.
డ్రోన్లతో జూదగాళ్లపై పోలీసుల నిఘా
రాయచోటి : జిల్లాలో ఆసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టేలా జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి నిర్ణయం పేకాట రాయుళ్ల గుండెల్లో గుబులు రేపుతోంది. అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపే కార్యక్రమానికి ఎస్పీ పూనుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో విచ్చలవిడిగా పేకాట, ఇతర జూదాలు, అసాంఘిక కార్యక్రమాలు జిల్లా ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న సమయంలో ఎస్పీ నిర్ణయం జిల్లా ప్రజలకు కొంత ఊరటనిస్తోంది. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు ఆధునిక టెక్నాలజీ వాడుతున్నారు. పేకాట స్థావరాలను గుర్తించి ఆయా ప్రాంతాలలో డ్రోన్ల సాయంతో పారిపోతున్న వారిని పట్టుకోవడం సులభతరంగా మారింది. డ్రోన్ కెమెరాల సహాయంతో జూదం, బహిరంగ మద్యపానం లాంటి చట్ట వ్యతిరేక పనులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే నిమ్మనపల్లి అటవీప్రాంతంలో చేపట్టిన డ్రోన్ల ద్వారా చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైనట్లు పోలీసులు తెలిపారు. సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని వదిలిపెట్టరాదని ఎస్పీ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఎక్కడైనా అసాంఘిక సంఘటనలు జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందిస్తే సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచి నిర్వహకులపై చట్టపరమైన చర్యలు చేపడతామని ఎస్పీ జిల్లా ప్రజలకు సందేశం ఇచ్చారు.
16 బైక్‌లు, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం
పేకాట స్థావరంపై దాడి వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ మహేంద్ర మామిడితోటలోని పేకాటస్థావరం

పేకాట స్థావరంపై పోలీసుల దాడులు