
మద్యం మత్తులో బిడ్డలపై తల్లి దాడి
మదనపల్లె రూరల్ : మద్యం మత్తులో కన్నబిడ్డలపై తాగుబోతు తల్లి దాడిచేసి, భయభ్రాంతులకు గురిచేసిన ఘటన బుధవారం అర్ధరాత్రి మదనపల్లెలో జరిగింది. పట్టణంలోని బాలాజీనగర్‌కు చెందిన లక్ష్మన్న, వాణి దంపతులు. వీరికి కిరణ్‌కుమార్(13), రుషి(12) ఇద్దరు సంతానం. కొంతకాలం క్రితం లక్ష్మన్న యాక్సిడెంట్ కేసులో జైలుకు వెళ్లాడు. ఈ క్రమంలో వాణి మద్యానికి బానిసైంది. మద్యం తాగిన ప్రతిసారీ ఇంట్లో గొడవచేస్తూ కన్నబిడ్డలను విచక్షణారహితంగా కొట్టేది. బుధవారం రాత్రి ప్లూటుగా మద్యం తాగిన వాణి మరోసారి బిడ్డలు కిరణ్‌కుమార్, రుషిపై దాడిచేసి కొట్టింది. అడ్డుకోబోయిన తల్లి అనసూయపై దాడికి పాల్పడింది. దీంతో భయపడిన పిల్లలు ఇంటి నుంచి కేకలు వేసుకుంటూ బయటకు పరిగెత్తుకు వెళ్లి ఇద్దరు యువకులను కాపాడాల్సిందిగా అభ్యర్థించారు. ఇంతలో వాణి అక్కడకు చేరుకుని పిల్లలపై మరోసారి దాడిచేయబోగా యువకులు అడ్డుకున్నారు. వారిపై కూడా కొడవలితో దాడికి పాల్పడింది. యువకులు గాయపడిన పిల్లలు, అనసూయమ్మను ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్సలు అందించారు. ఘటనపై టూటౌన్ పోలీసులకు ఫిర్యాదుచేశారు.
వెదురు మొక్కల పెంపకం
రాయచోటి : అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో డీఆర్వో మధుసూదనరావు గురువారం వెదురు మొక్కలు నాటారు. ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా జరగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా అవగాహన పెంచడానికి ఏటా సెప్టెంబరు 18న ప్రపంచ వెదురు దినోత్సవాన్ని జరుపుకొంటున్నట్లు తెలిపారు. అంతకు ముందుగా మేదరి వెదురు వృత్తిదారుల సంక్షేమం, అభివృద్ది సంస్థ నాయకులు రాయితీపై వెదురు ఇవ్వాలని, రాయచోటిలో వెదురు క్లస్టర్ ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం రాయచోటి మున్సిపాల్టీ, తహసీల్దార్, రహదారులు, భవనాల శాఖ, ప్రభుత్వ జూనియర్ కళాశాలలతోపాటు పలు ప్రభుత్వ కార్యాలయాల వద్ద వెదురు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గజపనేని రెడ్డయ్య, గజపనేని వెంకటసుబ్బయ్య, ఆర్ల నాగరాజు, టంగుటూరి నాగార్జున, గజపనేని వెంకట జయప్రసాద్, నరసింహులు, ఎల్లయ్య, వెంకటా చలపతి, కోలే గంగయ్య తదితరులు పాల్గొన్నారు.

మద్యం మత్తులో బిడ్డలపై తల్లి దాడి

మద్యం మత్తులో బిడ్డలపై తల్లి దాడి