
సాల్ట్ పథకంతో విద్యా రంగం నిర్వీర్యం
రాజంపేట టౌన్ : సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్సఫర్మేషన్(సాల్ట్) పథకంతో విద్యా రంగం నిర్వీర్యం అవుతుందని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎన్‌జీఓ హోంలో విలేకరులతో గురువారం ఆయన మాట్లాడుతూ ఈ నెల 15వతేదీ నుంచి 19వతేదీ వరకు నిర్వహిస్తున్న యూటీఎఫ్ రణభేరి కార్యక్రమంలో భాగంగా రాజంపేటలో పాల్గొన్నట్లు తెలిపారు. సాల్ట్ పథకంతో పాఠశాల పనిదినాల్లో శిక్షణ ఇస్తున్నారని, అనేక రకాల బోధనేతర కార్యక్రమాలను ఉపాధ్యాయులపై రుద్దుతున్నారన్నారు. ఈ పథకానికి గణాంకాలను ఇవ్వడం కోసం, గిన్నీస్ రికార్డుల కోసం ఉపాధ్యాయులను మానసిక వేధింపులకు గురిచేయడం తగదన్నారు. బోధనేతర కార్యక్రమాల బాధ్యతలను ఉపాధ్యాయులు చేస్తుండడంతో విద్యార్థులకు మెరుగైన బోధన చేయలేకపోతున్నారని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయులకు స్వేచ్చాయుత వాతావరణం కల్పించాలని కోరారు. 2023 జూలైలో నియమించాల్సిన 12వ పీఆర్సీ ఛైర్మన్‌ను ఇప్పటికీ నియమించలేదని, నాలుగు డీఏలు బకాయిలు ఉన్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలైనా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం ఒక్కరోజు చర్చించలేదని తెలిపారు. అంతకు ముందు బోయినపల్లె నుంచి ఎన్‌జీఓ హోం వరకూ యూటీఫ్ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బి.లక్ష్మీరాజ, ఎస్.జయచంద్రారెడ్డి, బిళ్లా హరిప్రసాద్, జాబీర్, చెంగల్‌రాజు, వెంకటసుబ్బయ్య, రమణమూర్తి, నాగేంద్ర, శివయ్య తదితరులు పాల్గొన్నారు.
యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు