
పోలీస్ స్టేషన్ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : వారం రోజులుగా తన సమస్య పట్టించుకోలేదనే మనస్థాపంతో పోలీస్ స్టేషన్ ఎదుట ఓ మహిళ ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం రాత్రి మదనపల్లెలో జరిగింది. బాఽధితురాలి వివరాల మేరకు.. మండలంలోని సీటీఎం పంచాయతీ నల్లగుట్టపల్లెకు చెందిన మల్లికార్జున భార్య యశోద(32) ఏడాది కిందట భర్తతో విడిపోయి పుట్టింట్లో ఉంటోంది. తన భర్త హార్ట్ పేషంట్ కావడంతో వైద్య చికిత్స, ఇంటి నిర్మాణం కోసం, డ్వాక్రా గ్రూపులో రూ.4 లక్షల రుణం తీసుకుంది. భర్తతో విడిపోయే సమయంలో పెద్ద మనుషుల సమక్షంలో అప్పు చెల్లిస్తానని మల్లికార్జున ఒప్పందం చేసుకున్నారు. అయితే అప్పు చెల్లించకపోవడంతో డ్వాక్రా గ్రూపు సభ్యులు యశోదపై ఒత్తిడి తెచ్చారు. రుణం నీవు తీసుకున్నావు చెల్లించాల్సిందేనని పట్టుపట్టారు. తన సమస్యను పరిష్కరించాలని తాలూకా పోలీసు స్టేషన్‌కు వచ్చి యశోద ఫిర్యాదు చేసింది. పోలీసుల ఆ సమస్యను పట్టించుకోకపోవడంతో మనస్థాపం చెంది తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. స్థానికులు బాధితురాలిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తాలూకా సీఐ కళా వెంకటరమణ యశోదను పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. సీఐ మాట్లాడుతూ బాఽధితురాలు యశోద ఎనిమిది నెలల క్రితం భర్తతో విడిపోయి మరో వ్యక్తితో సహజీవనం చేస్తోందన్నారు. ఆమె భర్త పిల్లలను పోషిస్తూ అప్పులు చెల్లిస్తూ, గుండె వైద్యం చేయించుకుంటున్నారన్నారు. ప్రస్తుతం అతడి భార్య యశోధ గ్రామంలోని ఇంటిని సైతం ఆమె పేరుపై మార్చి ఇవ్వాలని, పెద్ద మనుషులను తీసుకుని తాలూకా స్టేషన్‌కు వచ్చిందన్నారు. ఇది సివిల్ సమస్య కావడంతో కోర్టుకు వెళ్లి పరిష్కరించుకోవాలని సూచించామన్నారు. వారం రోజులుగా స్టేషన్‌కు వచ్చినట్లు చెప్పడం అవాస్తమన్నారు.