
కొరత.. కలత
యూరియా కోసం అన్నదాతల ఆవేదన రోదనగానే మారుతోంది. యూరియో.. రామచంద్రా అంటున్నా.. పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఒక బస్తా ఎరువుకోసం మండే ఎండలో.. పస్తులతో రోజంతా పడిగాపులు తప్పడం లేదు. చాంతాడంతా క్యూలైన్లో నిల్చోవాల్సి వస్తోంది. అప్పటికీ ఎరువు దొరుకుతుందో లేదో తెలియని పరిస్థితి. గత ప్రభుత్వ హయాంలో ఎన్నడూ చూడని దుస్థితిని ఎదుర్కొంటున్న రైతుకు.. కూటమి ప్రభుత్వం విషమ పరీక్ష పెడుతోంది.
● కొనసాగుతున్న యూరియా కష్టాలు
● క్యూలైన్లలో అవస్థలు పడుతున్న రైతులు
నిమ్మనపల్లె/కురబలకోట: రైతులకు యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. గురువారం మండలంలోని రెడ్డివారిపల్లెలో 250, బండ్లపైలో 250, వెంగంవారిపల్లెలో 290, నిమ్మనపల్లెలో 224, ముష్టూరులో 200 మొత్తంగా 1,214 యూరియా బస్తాలను రైతులకు పంపిణీ చేశారు. అయితే తగినంత యూరియా అందుబాటులో లేకపోవడంతో తమకు అందుతుందో లేదో అన్న భయంతో అధికసంఖ్యలో పంపిణీ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో కొందరికి యూరియా అందినా మరికొందరికి పూర్తిగా దక్కకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ వైపు ఎండవేడిమి, ఉక్కపోత అధికంగా ఉన్నా క్యూలైన్లో వేచిచూస్తూ అవస్థలు పడ్డారు. నిమ్మనపల్లె రైతుసేవా కేంద్రాల వద్ద ఒకరిద్దరు స్పృహ తప్పారు. వెంటనే స్థానికంగా ఉన్న రైతులు నీరు అందించి సపర్యలు చేయడంతో కోలుకున్నారు. యూరియా కొరత లేదని ఇప్పటికే 200 మెట్రిక్ టన్నులు పంపిణీ చేశామని, మరో 150 మెట్రిక్ టన్నులు మండలానికి కేటాయించారని అధికారులు తెలిపారు.
● కురబలకోట మండలంలోనూ యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. రైతు సేవాకేంద్రాల వద్ద రైతులు బారులుతీరారు. సరిపడా నిల్వలు లేకపోవడంతో ఒక్కో రైతుకు ఒక బస్తామాత్రమే ఇస్తున్నారు. దీంతో పంటలు ఎలా సాగు చేసుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా కొరతపై స్థానిక వ్యవసాయాధికారితో మాట్లాడగా మండలానికి 40 టన్ను లు వచ్చిందని, ఇంకా రావాల్సి ఉందని తెలిపారు.

కొరత.. కలత