
రణభేరిని జయప్రదం చేయండి
రాయచోటి : ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న ఆర్థిక, విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న యూటీఎఫ్ రణభేరిని జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హరిప్రసాద్, జాబీర్‌లు పిలుపునిచ్చారు. శనివారం రాయచోటిలో యూటీఎఫ్ జిల్లా కార్యాలయం వద్ద రణభేరికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఉమ్మడి సర్వీసు రూల్స్ సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపడం లేదన్నారు. బదిలీలు, ప్రమోషన్లు పూర్తయి మూడు నెలలు కావస్తున్నా ఉపాధ్యాయులు ఇంకా పాత స్థానాల్లో కొనసాగుతున్నారని తెలిపారు. నాణ్యమైన విద్యను అందిస్తామని చెబుతూనే ప్రభుత్వ పాఠశాలల నుంచి విద్యార్థులు ప్రైవేటుకు తరలిపోయేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు పి.వెంకట సుబ్బయ్య, వై.శ్రీధర్ రెడ్డి, ఫణీంద్ర కుమార్ యాదవ్, రాష్ట్ర కౌన్సిలర్ డి.చెంగలరాజు, సీనియర్ నాయకులు ఎస్.లక్ష్మీకుమార్, ఎం.నాగేశ్వర్ గౌడ్, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాగేంద్ర, మనోహర్, రామమూర్తి, శంకర్, శశికిరణ్, అమీన్, నాగార్జున, శివశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.