
పట్టపగలే రెండిళ్లలో చోరీ
గుర్రంకొండ : మండల కేంద్రమైన గుర్రంకొండలో పట్టపగలే రెండిళ్లలో చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఇళ్ల తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించి బీరువాల్లోని విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. స్థానిక బలిజగడ్డ వీధిలో అపోలో రెడ్డెప్ప, పరసా శ్రీనివాసులు కుటుంబాలు వ్యవసాయం చేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు. శనివారం వారు ఇళ్లకు తాళాలు వేసుకొని వ్యవసాయ పనుల నిమిత్తం పొలాల వద్దకు వెళ్లారు. మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూడగా అప్పటికే ఇంటి తాళాలు పగులగొట్టి ఉండడం గమనించారు. రెండిళ్లలోని బీరువాలను బద్దలు గొట్టి అందులో వస్తువులు చోరీ చేసినట్లు గుర్తించారు. జనసంచారం తక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో దయం 11 గంటల నుంచి 12 గంటల మధ్యలోనే చోరీలు జరిగినట్లు స్థానికులు పేర్కొన్నారు. కాగా అపోలో రెడ్డెప్ప ఇంట్లో విలువైన వస్తువులు ఏమీ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. పరసా శ్రీనివాసులు ఇంట్లో మాత్రం రూ. 60 వేలు నగదు, ఒక ఉంగరం, ఒకచైను, ఒక జత కమ్మలు చోరీకి గురైనట్లు తేలింది. వీటి విలువ సుమారు రూ. 2.50 లక్షలు ఉంటుందని బాధితులు పేర్కొన్నారు. జరిగిన సంఘటనపై స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ రఘరామ్ తమ సిబ్బందితో సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గత నెల రోజుల్లో ఇదే ప్రాంతంలో వరుసగా నాలుగు చోరీలు జరగడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు.