
ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ దుర్మార్గం
రాయచోటి : ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం రాయచోటిలో పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం నిర్మించిన మెడికల్ కళాశాలలను ప్రభుత్వం ప్రైవేటీకరణ పేరుతో ముందుకు సాగడం అన్యాయమని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మెడికల్ కళాశాల ఉండాలన్న దూర దృష్టితో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాహసోపేత నిర్ణయంతో ఒకేసారి 17 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశారన్నారు. వీటిలో ఏడు కళాశాలలకు ఎంసీఐ అనుమతులు లభించగా, మిగిలిన పది కళాశాలలకు ఎంసిఐ అనుమతులు ఇస్తే కూటమి ప్రభుత్వం స్వయంగా వాటిని తోసిపుచ్చిందన్నారు. ఒక మెడికల్ కళాశాల నుంచి రూ. 500 కోట్లు నుంచి రూ. 1000 కోట్లు వరకు కమీషన్లు తీసుకునే ప్రక్రియలో భాగంగానే ప్రైవేటు పరం చేయడం దుర్మార్గమన్నారు. 25 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాలను కూడా ఇవ్వలేదంటే ఆయన దృష్టిలో పేదవారి విలువ ఏమిటో బహిరంగంగా తెలుస్తోందని విమర్శించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను మానకపోతే రాష్ట్ర యువతతో కలిసి పెద్దఎత్తున ప్రభుత్వాన్ని నిలదీయాల్సి వస్తుందని హెచ్చరించారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన
కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి