
కమీషన్ల కోసమే ప్రైవేటుకు వైద్య కళాశాలలు
మదనపల్లె : రాష్ట్రంలో వైద్య కళాశాలలను కమీషన్ల కోసమే ప్రభుత్వం పీపీపీ విధానంలో ప్రైవేట్‌కు అప్పగించేందుకు సిద్ధమైందని బీఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్‌కుమార్ ఆరోపించారు. శుక్రవారం మదనపల్లె పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని అన్నారు. 63 ఏళ్ల లీజుకు అప్పగించడం వెనుక వందల కోట్లను కమీషన్ల రూపంలో దోచుకునేందుకు ఈ విధానం తెస్తున్నారని ఆరోపించారు.ప్రైవేట్‌కు అప్పగించడం ద్వారా రాజ్యాంగబద్ధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పేద విద్యార్థులు రిజర్వేషన్ కోల్పోయి వైద్య విద్యకు దూరమై తీవ్రంగా నష్టపోతారని అన్నారు. పేదప్రజల ఆస్తిగా భావించే వైద్య కళాశాలలను ప్రయివేటు పేరుతో ఓ వర్గానికి ఆస్తులను కట్టబెట్టి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా కనిపిస్తోందన్నారు. మదనపల్లె నుంచి రాజకీయ జీవితం ప్రారంభించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇక్కడి వైద్య కళాశాలను ప్రభుత్వపరంగా నడిపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో దోషిగా మిగిలిపోతారన్నారు. మదనపల్లె సమస్యలను పరిష్కరించాలని ప్రతిపక్ష నాయకునిగా ఆందోళన చేసిన ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా..వైద్య కళాశాల విషయంలో మాతో కలిసి పోరాటం చేస్తారో, పదవికి రాజీనామా చేస్తారో తేల్చుకోవాలని నిలదీశారు. వైద్య కళాశాలను ప్రయివేటుకు అప్పగిస్తుంటే ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఏం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వైద్య కళాశాలలకు లాభాలు లేనప్పుడు హెరిటేజ్ కంపెనీకి అధిక లాభాలు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. సంపద సృష్టిస్తానని ప్రజలను నమ్మించి అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రజల సంపదను ప్రైవేట్‌వారి చేతుల్లో పెడుతున్నారని అన్నారు బీఎస్పీ నాయకులు సహదేవ, చంద్ర, బాలాజీ, మహేష్, ప్రశాంత్, శివ, అనిల్, రెడ్డెప్ప, వేణు పాల్గొన్నారు.
బీఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు గౌతం కుమార్