
ఎరువుల కొరత రానివ్వొద్దు
రాయచోటి : జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం, యూరియా లభ్యతపై మండలాల వారీగా సమీక్షించి రైతు సేవా కేంద్రాలు(ఆర్‌ఎస్‌కే)ల్లో ఎరువులు సిద్ధంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్సు హాల్‌లో యూరియా లభ్యతపై వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి, జిల్లా వ్యవసాయ అధికారి, వ్యవసాయ సహాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులకు అవసరమయ్యే రసాయనిక ఎరువులపై కృత్రిమ కొరత సృష్టించే వారిపై చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. అలాగే డీలర్లు రైతులకు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు చేపట్టాలన్నారు.
రాయచోటి టౌన్/రామాపురం (రాయచోటి జగదాంబసెంటర్): అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని యథావిధిగా ఉంచాలని, ఇప్పటికే చేపట్టిన జిల్లా కార్యాలయాల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా రాయచోటిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం శ్రీకాంత్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ జిల్లాల మార్పులపై ప్రజల్లో అనేక అనుమానాలు నెలకొన్నాయని చెప్పారు. ప్రస్తుతం ఉన్న జిల్లాను విభజించాలనే ఆలోచనను కూటమి ప్రభుత్వం మానుకోవాలని, రాయచోటి కేంద్రంగా జిల్లాలో మార్పులు లేకుండా చూడాలని మంత్రివర్గ ఉప సంఘానికి లేఖ రాస్తానని తెలిపారు.
వైఎస్సార్‌కు ‘భారతరత్న’ ప్రకటించాలి
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌరపురస్కారం ‘భారతరత్న’ ప్రకటించాలని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి కోరారు. వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా రామాపురంలోని వైఎస్సార్ విగ్రహాలకు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ తన పాలనతో ప్రజల జీవితాలను ఎంతో ప్రభావితం చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అన్నారు.